YCP: రూ.15 కోట్ల భూమిని కబ్జా చేసిన వైసీపీ నేత!

గుంతకల్లులో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి దుకాణాలు నిర్మించి అద్దెకు ఇచ్చిన వైసీపీ నాయకుడి దందా బట్టబయలైంది. హనుమాన్ సర్కిల్ వద్ద ఉన్న విలువైన ప్రభుత్వ భూమిపై వైసీపీ నేత దేవేంద్రప్ప తన కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించాడు. సర్వే నంబర్లు 424-బి, 421-2లో కలిపి 54 సెంట్ల భూమిలో 30 సెంట్లపై షెడ్లు నిర్మించి 17 దుకాణాలు ఏర్పాటు చేశాడు. ఒక్క దుకాణానికి నెలకు రూ.25 వేలు అద్దె వసూలు చేస్తుండగా, ఆ స్థల మార్కెట్ విలువ రూ.15 కోట్లకు పైగానే ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ కౌన్సిలర్ కె.రామచంద్ర ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశాలపై సర్వే జరిపిన తహసీల్దార్ నివేదికలో అక్రమ నిర్మాణాలు స్పష్టమయ్యాయి. అయితే రాజకీయ ఒత్తిళ్లతో మరో నివేదికలో ఆక్రమణ కేవలం 12.75 సెంట్లే అని చూపించారు. దాంతో పాటు ప్రజాప్రతినిధి అనుచరులకు వాటా ఇవ్వాలన్న ఒప్పందం కుదిరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ స్పందిస్తూ, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ప్రభుత్వ భూములు కొందరి హస్తాల్లోకి వెళ్లిపోతుండటం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com