YS BHARATHI: వైసీపీలో కీలక రోల్ పోషించేందుకు వైఎస్ భారతీ సిద్ధం.!

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భార్య మేడం భారతీ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్లూ ‘బిజినెస్’ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు వైసీపీ నేతలతో మాటామంతీ కలుపుతున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాపకింద నీరులా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్తో పాటు భారతి కూడా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకుంటారా? లేదా జగన్కు ప్రత్యామ్నాయంగా ఆమెను సిద్ధం చేస్తున్నారా? అన్నదానిపై స్పష్టత లేదు. కానీ భారతి రాజకీయ ఎంట్రీ మాత్రం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనే అన్నీతానే వ్యవహరిస్తున్నారు. జగన్ అరెస్ట్ అయినప్పుడు మాత్రం తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పార్టీకోసం తీవ్రంగా కృషి చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారు. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ పార్టీలో లేరు. కుటుంబంలో విభేదాలు రావడంతో జగన్ కు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీని నడిపించాల్సిన బాధ్యత జగన్ ఒక్కరిపైనే ఉంది. ఒకవేళ జగన్ అనుకోని పరిస్థితుల్లో అరెస్ట్ అయితే అప్పుడు పార్టీని ఎవరు నడిపిస్తారనే ప్రశ్న చాలాకాలంగా ఉంది. అయితే ఇప్పుడు జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డి ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె తెరవెనుక పార్టీలో ఇప్పటికే కీరోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
భారతీ ఎంట్రీతో కలకలం
పార్టీలో ఎవరెవ రు ఏం చేస్తున్నారు? మనం ఏమి చేయాలంటూ ఆమె ఆరా తీస్తున్నారు. భారతి ‘సడెన్ ఎంట్రీ’ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ‘బిజినెస్’ వ్యవహారాల్లో ఆమె అత్యంత జాగ్రత్తగా ఉన్నట్టుగా, ఇప్పుడు పార్టీ నేతలతో సంప్రదింపుల్లో ఆ నియమాలే పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ స్వయంగా చెప్పినట్లుగా ఆయనకు సెల్ఫోన్ లేదు. భారతి దగ్గర కూడా సెల్ఫోన్ ఉంటుందో లేదో తెలియదు కానీ.. మూడు రకాల పద్ధ్దతుల్లో పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. బాగా ప్రముఖులైన పార్టీ నాయకులతో ఆమె నేరుగా మాట్లాడుతున్నారు. భారతి రెడ్డితో మాట్లాడిన తర్వాత జగన్ దృష్టికి కూడా కొన్ని విషయాలను కొందరు నేతలు తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. జగన్ అరెస్ట్ అయితే పార్టీని నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేందుకే భారతి రెడ్డి ఇప్పటి నుంచే ఫోన్లు చేసి నేతలతో టచ్ లోకి వెళ్తున్నట్టు కొందరు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్దికాలానికే పార్టీ తెరమరుగవుతుందన్న కొందరి నేతల అభిప్రాయాలతో భారతి అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. జగన్ కార్యకాలాపాలు ఎలా ఉన్నప్పటికీ, పార్టీ నేతలను ప్రత్యక్షంగా సమన్వయపరిచే బాధ్యతలను ఆమె తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com