SHARMILA: సీఎం కాగానే విడిపోదామన్నారు

మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం నడుస్తున్న సంగతి తెలిసింది. దీనిపై వైఎస్సార్ అభిమానులకు షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. ‘నాన్న నన్నెప్పుడూ ఆడపిల్ల అని తక్కువ చేసి చూడలేదు. ఆస్తిలోనూ సమాన వాటా ఉండాలని నాన్న ఎప్పుడూ అనేవారు.’ అని లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్ అభిమానులకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ లేఖ రాసినట్లు షర్మిల చెప్పారు. సాక్షి పేపర్ చూశానని... సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఉందని... కాబట్టి ఏదైనా నమ్మించగలరని షర్మిల అన్నారు. అయినా వైఎస్సార్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం తనదని వెల్లడించారు. అమ్మ వైఎస్ విజయమ్మ, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారని... అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. 'రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే.. తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారని గుర్తు చేశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదని గుర్తు చేశారు. నాన్న బతికి ఉన్నన్ని రోజులూ ఒకే మాట అనేవారు. 'నా' నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానమని అనేవారని గుర్తు చేసుకున్నారు.
జగన్ స్వార్జితం కాదు
స్వార్జితం అని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని షర్మిల అన్నారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవమని వెల్లడించారు. ఈరోజు సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన, అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదన్నారు. ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదని వెల్లడించారు. ఆస్తి పంచడం అంటే ఇవిగో ఈ ఆస్తులు.. నీకు ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే..! నేను జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల్లో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదమని షర్మిల వెల్లడించారు. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక రాజశేఖర్ రెడ్డి నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచాలని అనుకున్నారన్నారు. కాబట్టే ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నామని తెలిపారు.
సీఎం కాగానే మారిపోయారు
సీఎం కాగానే జగన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారని షర్మిల అన్నారు. తనపై చిన్నచూపే కాదు.. సీఎం కాగానే విడిపోదామని ప్రతిపాదించారని ఆరోపించారు. విడిపోవద్దని అమ్మ, తాను చెప్పామని... ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారన్నారు. భారతి సిమెంట్స్, సాక్షిలో ఎక్కువ వాటా కావాలని అడిగారన్నారు. 60 శాతం తీసుకుంటా.. 40 శాతం ఇస్తా అని జగన్ ప్రతిపాదించారని అన్నారు. ఆ తర్వాత అరగంటలో ఆస్తుల వాటా తేలిపోయిందన్నారు. కొద్ది వారాల్లోనే ఎంవోయూ కూడా తయారైంది. నాకు రావాల్సిన వాటా ఇచ్చారు తప్పితే.. ప్రేమాభిమానాలతో కాదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com