SHARMILA: తల్లిపై కేసు వేసిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా..?
వైఎస్ జగన్‌పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి విషయంలో కన్నతల్లిపై కేసు వేసిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ‘ఇలాంటి గొడవలు అందరి ఇళ్లలో ఉండేవే అని సునాయాసంగా మాట్లాడుతున్నారు. మీకు మానవత్వం లేదా? ఎవరో మాట్లాడితే బాధపడేదాన్ని కాదు.. సుబ్బారెడ్డి బాబాయి మాట్లాడే వరకు చాలా బాధపడ్డా. కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని షర్మిల పేర్కొన్నారు. జగన్ కోసం ఎంతో త్యాగం చేస్తే అన్యాయం చేస్తారా అంటూ షర్మిల కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తనను బాధించిందంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. జగన్ కోసం 3200 కి. మీ మేర పాదయాత్ర చేశానన్నారు. కన్నతల్లిని, చెల్లిని కోర్టుకు లాగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అంటూ ప్రశ్నించారు.
వైవీపై సంచలన ఆరోపణలు
వైవీ సుబ్బారెడ్డి.. జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. 'నాబిడ్డలు కూడా మీ కళ్ల ముందే పెరిగారు. వారికి అన్యాయం చేయాలని ఎలా అనిపించింది. అన్ని విషయాలు తెలిసి కూడా మా బాబాయి ఎందుకిలా మాట్లాడుతున్నారు" అంటూ ఆమె మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి, ఆయన కొడుకు ఆర్థికంగా లాభపడ్డారని షర్మిల అన్నారు.
అమ్మ కుమిలిపోతోంది
ఆస్తి కోసం.. కన్న కొడుకే కోర్టుకు ఈడ్చి, కేసు పెట్టడంతో అమ్మ కుమిలిపోతోందని... ఇదంతా చూసేందుకే తాను ఇంకా బతికి ఉన్నానా అని రోదిస్తోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ రద్దు అవుతుందని తల్లిపై కేసు పెట్టానని జగన్ అనడం దుర్మార్గమని, తన ప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు లాగే దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా అంటూ మండిపడ్డారు. జగన్‌కూ .. తనకూ మధ్య ఏర్పడిన ఆస్తుల వివాదం మీడియా ప్రస్తావించగానే... షర్మిల కన్నీరు పెట్టుకున్నారు. ‘‘అన్నగా జగన్ ఆదేశించిన వెంటనే ఆనాడు పాదయాత్ర చేశాను. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేశాను. కానీ, నాకు ఒక్క మేలైనా జగన్ చేశాడా? ’’ అని గద్గద స్వరంతో ప్రశ్నించారు. జగన్ కోసం అమ్మ ఎంతో చేశారని, మోకాళ్ల నొప్పులు ఉన్నా .. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆ నొప్పులకు ఐస్ రుద్దుకుని మరీ తిరిగారని గుర్తు చేశారు. అలాంటి అమ్మ మీద ఆస్తికోసం జగన్ కేసు పెట్టారని ఆగ్రహించారు. జగన్ ఆదేశిస్తే చనిపోతానని తెలిసినా సూర్యుడిని తాకేదానినని.. తనకు ఏం మేలు చేశాడో జగన్ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com