SHARMILA: వైసీపీది పాపం.. కూటమిది ప్రజలకు శాపం

వైసీపీ, కూటమి పార్టీలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ చేసింది పాపం అయితే.. రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతున్నది శాపం అని ఆమె పేర్కొన్నారు. కరెంట్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల నెత్తినే మోపుతోందన్నారు. అలానే కూటమి సర్కారు ప్రజలకు భారీ కరెంటు షాక్ ఇచ్చిందంటూ ఆమె ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయని, గత ప్రభుత్వం చేసిన పాపాలకు కూటమి ప్రభుత్వం ప్రాయశ్చిత్తం చేయడానికి బదులుగా ప్రజలపై బారం మోపడం సరికాదని షర్మిల మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పాపాలకు పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల నెత్తినే మోపుతోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్లలో తమ తప్పు లేదని, తమకు అసలు సంబంధం లేదని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల మీదే ఆ బారాన్ని మోపిందని విమర్శించారు. కూటమి సర్కార్ చెబుతున్నట్లుగా ఇది విద్యుత్ ఛార్జీల సర్దుబాటు కాదు.. ప్రజలకు "సర్దుపోటు" అని... ప్రజలకు కూటమి సర్కారు ఇచ్చిన భారీ కరెంటు షాక్ అని షర్మిల పేర్కొన్నారు.
5 ఏళ్లలో వైసీపీ భారం
వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు తొమ్మిదిసార్లు పెరిగినట్లు షర్మిల వెల్లడించారు. కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచేది లేదని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే, తప్పు ఎవరు చేసినా.. ప్రజలపై ఆ భారాన్ని మోపొద్దనే చిత్తశుద్ది ఉంటే వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజలపై పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని గల్లా పట్టి అడగాలి కానీ, ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేసినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ తరఫున హెచ్చరించారు.
ప్రధానిని అడగాలని హితవు
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని గల్లా పట్టి అడగాలని కూటమి ప్రభుత్వానికి షర్మిల సూచించారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోబోమన్నారు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోందన్నారు. ప్రజల ముక్కు పిండి ట్రూఅప్ ఛార్జీల రూపంలో, అధిక కరెంటు బిల్లులు వసూల్ చేయడం దారుణం. వసూల్ చేయడాన్ని నిరసిస్తూ రేపటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తున్నామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com