YS VIVEKA CASE: వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణపై తెలంగాణ హైకోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆమె సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. సీబీఐ కోర్టులో తన తండ్రి హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఇప్పటికే దాదాపు నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతున్నా.. పురోగతి ఏమీ లేదని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతోంది.. ట్రయల్ ప్రారంభం కాకపోవడానికి కారణాలు ఏంటో సమాధానం చెప్పాలంటూ తెలంగాణ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో నిందితులు సైతం స్పందించాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
అరు నెలల్లో ముగించేలా ఆదేశించండి
2019 మార్చి 14న అర్ధరాత్రి ఈ హత్య చోటుచేసుకుందని.. సీబీఐ అధికారులు విచారణ చేపట్టి ఇప్పటికే రెండు ఛార్జిషీట్‌లు దాఖలు చేశారని వైఎస్ సునీత పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంకా సీబీఐ కోర్టులోనే విచారణ కొనసాగుతోందని.. దీన్ని ఆరు నెలల్లోగా ముగించేలా కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరారు. లక్షల సంఖ్యలో పేజీలు ఉండటంతో ప్రింటింగ్‌కాపీలు ఇవ్వడం కుదరదు గనక హార్డ్ డిస్క్‌లను ఓపెన్ చేయాలని సీబీఐ అధికారులు చెబుతున్నారని సునీత ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
వ్యక్తిగత నోటీసులకు అనుమతి
కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి, శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలకు వ్యక్తిగతంగా నోటీసులు పంపేందుకు వివేకా కుమార్తె సునీతారెడ్డికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. వివేకా హత్య కేసుకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టులో ఇంతవరకు ట్రయల్ ప్రారంభం కాలేదని.. ఏడాదిన్నరగా సీఆర్పీసీ 207 దశలోనే ఉందని పేర్కొంటూ సునీతారెడ్డి గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు.ఇది తొలుత న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ఎదుట విచారణకు వచ్చింది. ఇప్పటికే నమోదైన సుమోటో పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం పర్యవేక్షిస్తున్నందున.. ఈ వ్యాజ్యాన్నీ అక్కడికే బదిలీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఈ పిటిషన్ శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com