వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు..

Ys Viveka Murder case

వైఎస్ వివేకానందరెడ్డి ఫైల్ ఫోటో 

YS Viveka Murder Case : కొన్ని నెలలుగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ..వందలాది మంది సాక్ష్యుల్ని విచారించింది. ఈ హత్యకు పాల్పడిన హంతకులు, వారికి అందిన సుపారీ వివరాలను కూడా సేకరించినట్లు సమాచారం.

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. కొన్ని నెలలుగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. వందలాది మంది సాక్ష్యుల్ని విచారించింది. ఈ హత్యకు పాల్పడిన హంతకులు, వారికి అందిన సుపారీ వివరాలను కూడా సేకరించినట్లు సమాచారం. నిన్న కడప జిల్లా జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్నను హాజరుపరిచిన సీబీఐ.. కీలక వాంగ్మూలాన్ని నమోదు చేయించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ కేసులో ఈ వాంగ్మూలమే కీలకంగా మారింది. అటు, రాత్రి పులివెందుల చేరుకున్నాక రంగన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

వివేకా హత్య కేసులో ఈ ఏడాది జూన్‌ 6 నుంచి డీఐజీ సుధాసింగ్‌ నేతృత్వంలో సీబీఐ బృందం కడప సెంట్రల్‌ జైలు గెస్ట్‌హౌస్‌లో విచారణ చేపట్టింది. పలు దఫాలు దాదాపు 35 నుంచి 40 మందిని ప్రశ్నించింది. వీరిలో వాచ్‌మన్‌ రంగయ్యతో పాటు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లా, మాజీ డ్రైవర్‌ దస్తగిరి, పులివెందులకు చెందిన కృష్ణయ్యను విచారించారు. హత్యకు గురైన వివేకా ఇంటిని, పరిసరాలను పలుమార్లు పరిశీలించిన దర్యాప్తు బృందాలు..కీలక సమాచారం సేకరించాయని సమాచారం.

సీబీఐ ప్రశ్నించిన ఆరుగురిలో.. వాచ్‌మ్యాన్‌ రంగన్న సంచలన విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. వివేకా హత్యలో మొత్తం ఇద్దరు ప్రముఖులు సహా మొత్తం తొమ్మిది మంది ప్రమేయం ఉందని రంగన్న వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వివేకా హత్యకు 8 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని చెప్పినట్లు సమాచారం. అయితే... రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలో మరో కీలక అంశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ప్రముఖుల హస్తం కూడా ఉందని రంగన్న చెప్పారని సమాచారం. రంగన్న వాంగ్మూలాన్ని సీబీఐ రహస్యంగా రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఎవరనే కోణంలో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు సమాచారం.

మరోవైపు జమ్మలమడుగు న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత శుక్రవారం రాత్రి పులివెందులకు చేరుకున్న ఆయన కొంతమందితో మాట్లాడిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఎవరికైనా తన పేరు చెబితే తనను కాల్చేస్తానని బెదిరించారని.. అందుకే తాను భయపడి ఏమీ చెప్పలేదన్నారు రంగన్న. తనపై ఈగ వాలనివ్వబోమని సీబీఐ అధికారులు చెప్పారన్నారు. ఎవరితోనూ ఏమీ చెప్పొద్దని, ఏం అడిగినా ఏమీ తెలియదని సమాధానం చెప్పాలంటూ తనకు సీబీఐ అధికారులు సూచించారని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story