Andhra Pradesh: ఎన్నికల ముంగిట వైసీపీకి ఎదురుదెబ్బలు

Andhra Pradesh: ఎన్నికల ముంగిట వైసీపీకి ఎదురుదెబ్బలు
X
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుండటంతో...


ఎన్నికల ముంగిట అధికార వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసంతృప్తిగా ఉన్న నేతలందరూ ఒక్కొకరుగా పార్టీని వీడుతున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్‌ పార్టీ గాలి వీచినా.. విశాఖలో మాత్రం తెలుగుదేశం సత్తాచాటింది. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే స్థానిక టీడీపీ నేతలక గాలం వేసింది. అలా చేరిన నేతలకు తర్వాతి రోజుల్లో ప్రాధాన్యం లేకపోవడం... మరో వైపు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతండటంతో ఇప్పుడు వారంతా తమ దారి తాము చూసుకుంటున్నారు.

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు పార్టీకి రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో పెందుర్తి టికెట్‌ ఆశిస్తున్న ఆయనకు.. వచ్చే సూచనలు కనిపించకపోవడంతో పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారు. పార్టీ విధానాలపై అసంతృప్తికి తోడు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా వైసీపీలో కొందరు నాయకులు పెత్తనం చేస్తున్నారని.. తన నిర్ణయాలకు విలువ ఇవ్వడం లేదని పంచకర్ల రమేష్‌బాబు బహిరంగంగా అసంతృప్తిని వెళ్లగక్కారు.

పంచకర్ల రమేష్‌బాబు బాటలోనే మరికొంత మంది వైసీపీ నాయకులు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖను రాజధాని చేస్తామని.. అక్కడి నుంచే పాలన అంటూ వైసీపీ మూడేళ్లుగా ఊదరగొడుతున్నా జనం నమ్మడం లేదని అసంతృప్త నేతలు చెబుతున్నారు. అధికార పార్టీ నాయకుల భూదందాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ఆరు నెలలే సమయం ఉండటంతో.. పరిస్థితి చేయిదాటకముందే పార్టీ నుంచి బయటపడాలని చూస్తున్నారు.

Tags

Next Story