Yuva Galam : పలమనేరు పర్యటిస్తున్న లోకేష్

నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా ఎనిమిదోవ రోజు లోకేష్ పలమనేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రొంపిచర్లకు వెళ్లిన లోకేష్‌కు యువత ఘన స్వాగతం పలికారు. ఆయనకు సమస్యలు చెప్పుకున్న యువత... తమపై వైసీపీ కార్యకర్తల దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి తమపై దాడి చేయించారని లోకేష్ కు చెప్పారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. పైగా తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇక గ్రామంలో టీడీపీ బ్యానర్లు కట్టిన ప్రతీ సారి చించేసి.. తమను రెచ్చగొడుతున్నారని లోకేష్‌కు తెలిపారు.
అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు లోకేష్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని.. కార్యకర్తల త్యాగాలను పార్టీ మరువదన్నారు. చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన ఏ ఒక్క అధికారిని వదలేది లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చక్రవడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దామని కార్యకర్తలతో అన్నారు. ఇక కార్యకర్తలంతా మరింత ఉత్సాహంతో పని చేయాలని పిలుపు నిచ్చారు. ఇక పుంగనూరులో పెద్దిరెడ్డి సామ్రాజ్యం కూలడం ఖాయమని.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎవరిని వదలబోనని లోకేష్ తేల్చి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com