Yuvagalam: దూకుడుగా యువగళం.. 135 మండలాలు, 12వందల 97 గ్రామాలు

Yuvagalam: దూకుడుగా యువగళం.. 135 మండలాలు, 12వందల 97 గ్రామాలు
సుమారు 30 లక్షల మంది ప్రజలు లోకేష్ ను నేరుగా కలిసి సమస్యలను విన్నవించారు.


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యువగళం అరుదైన మైలురాయిని చేరుకుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని కొత్తపల్లి వద్ద 2వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు 53 శాసనసభ నియోజకవర్గాలు, 135 మండలాలు, 12వందల 97 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగిందని టీడీపీ నేతలు తెలిపారు. ఇక.. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ తనదైన శైలిలో వాటిని దాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. సుమారు 30 లక్షల మంది ప్రజలు లోకేష్ ను నేరుగా కలిసి సమస్యలను విన్నవించారు.

పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకున్న నేపథ్యంలో నారా లోకేష్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ‘కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత తొలి అడుగుతో ప్రారంభమైన యువగళం జనగళమై, మహా ప్రభంజనమై, అరాచక పాలకుల గుండెల్లో సింహస్వప్నమై.. ప్రజలను చైతన్యపరుస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతోందన్నారు. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగుతున్న తన పాదయాత్ర కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద.. చారిత్రాత్మక 2వేల కిలోమీటర్లకు చేరుకోవడం జీవితంలో మరపురాని ఘట్టం అని పేర్కొన్నారు. ఇందుకు గుర్తుగా కొత్తపల్లిలో ఆక్వారైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించానన్నారు. కాగా లోకేష్ పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో యువగళం హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్‌లో ఇండియా వైడ్‌గా ఆ హ్యాష్ ట్యాగ్ 3వ స్థానంలో ఉంది.

ముఖ్యంగా తన పాదయాత్రలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు లోకేష్‌. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల కోసం టీడీపీని బలోపేతం చేసే దిశగా నేతలందరినీ సమన్వయం చేస్తున్నారు. అలా ఇప్పటివరకు 49 బహిరంగ సభలను నిర్వహించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో యువగళం కొనసాగిన పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించి ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో నెల్లూరు జిల్లాలో ఈసారి టీడీపీ బలంగా పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలోనూ టీడీపీకి గ్రాఫ్ పెరిగిందంటున్నారు.

తాము అధికారంలోకి వస్తే యువత కోసం చేపట్టబోయే కార్యక్రమాలను తన పాదయాత్రలో లోకేష్ వివరిస్తున్నారు. మహానాడులో టీడీపీ అధినేత ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతి వంద కిలోమీటర్లకు పాదయాత్ర పూర్తి కాగానే అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. మరోవైపు టీడీపీ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, తెచ్చిన పరిశ్రమల వద్ద పలువురితో సెల్ఫీ ఛాలెంజ్‌ను చేపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తూ జగన్‌పై మాటల తూటాలను పేలుస్తున్నారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story