Skoda Kushaq : మారిన లుక్, పెరిగిన బూట్ స్పేస్..2026 స్కోడా కుషాక్ లో ఏమేం మారాయంటే?

Skoda Kushaq : మారిన లుక్, పెరిగిన బూట్ స్పేస్..2026 స్కోడా కుషాక్ లో ఏమేం మారాయంటే?
X

Skoda Kushaq : ఆటోమొబైల్ రంగంలో యూరోపియన్ స్టైల్, పర్ఫార్మెన్స్‌కు మారుపేరుగా నిలిచే స్కోడా కుషాక్ ఇప్పుడు కొత్త అవతారంలోకి వచ్చేసింది. 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను స్కోడా ఇండియా తాజాగా ఆవిష్కరించింది. కేవలం చిన్నపాటి మార్పులతో సరిపెట్టకుండా, ఈసారి క్రెటా, సెల్టోస్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేలా అదిరిపోయే ఫీచర్లను జోడించింది. ముఖ్యంగా ఐదు ప్రధాన మార్పులు ఈ ఎస్‌యూవీని సెగ్మెంట్లోనే హాట్ టాపిక్‌గా మార్చాయి.

స్కోడా ఇండియా తన పాపులర్ ఎస్‌యూవీ కుషాక్‌ను 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో సరికొత్తగా ముస్తాబు చేసింది. ఈ కొత్త మోడల్‌లో కస్టమర్లు ఎప్పటి నుంచో కోరుకుంటున్న పనోరమిక్ సన్‌రూఫ్‌ను స్కోడా చివరకు ప్రవేశపెట్టింది. గతంలో ఇది సింగిల్ పేన్ సన్‌రూఫ్‌కే పరిమితం కాగా, ఇప్పుడు భారీ పనోరమిక్ వ్యూతో కారుకు ప్రీమియం లుక్ వచ్చింది. అంతేకాకుండా ఈ సెగ్మెంట్లోనే మొదటిసారిగా వెనుక సీట్లలో మసాజ్ ఫంక్షన్‌ను అందించడం విశేషం. లాంగ్ డ్రైవ్‌లలో వెనుక కూర్చునే ప్రయాణికులకు ఇది విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది.

కారు వెలుపల డిజైన్ విషయానికి వస్తే, ఫ్రంట్ గ్రిల్ ఇప్పుడు మరింత వెడల్పుగా మారి, మధ్యలో కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్‌తో మెరుస్తోంది. ఇది స్కోడా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కోడియాక్‎ను గుర్తుకు తెస్తుంది. వెనుక వైపు కూడా టెయిల్ లైట్లను కనెక్ట్ చేస్తూ ఎల్ఈడీ బార్‌ను అమర్చారు, దానిపై వెలిగే SKODA అక్షరాలు కారుకు మరింత రిచ్ లుక్‌ని ఇస్తున్నాయి. అదనంగా షిమ్లా గ్రీన్, చెర్రీ రెడ్, స్టీల్ గ్రే వంటి సరికొత్త రంగులను కూడా ప్రవేశపెట్టారు.

టెక్నాలజీ పరంగా చూస్తే.. కారు లోపల 10.25 ఇంచుల భారీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే (డిజిటల్ కాక్‌పిట్), 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఈ సిస్టమ్‌లో గూగుల్ Gemini AI ఆధారిత కంపానియన్ యాప్‌ను జోడించారు, దీని ద్వారా వాయిస్ కమాండ్స్ సహాయంతో వార్తలు వినడం లేదా కారు ఫీచర్లను కంట్రోల్ చేయడం సులభతరం అవుతుంది. అలాగే, లగేజీ కోసం బూట్ స్పేస్‌ను 385 లీటర్ల నుంచి ఏకంగా 491 లీటర్లకు పెంచడం విశేషం.

ఇక ఇంజిన్ పర్ఫార్మెన్స్‌లో కూడా కీలక మార్పు జరిగింది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే పాత 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో ఇప్పుడు కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల కారు నడపడం మరింత స్మూత్‌గా ఉండటమే కాకుండా మైలేజీ కూడా పెరిగే అవకాశం ఉంది. 1.5 లీటర్ ఇంజిన్ మోడల్‌కు వెనుక చక్రాలకు కూడా డిస్క్ బ్రేక్‌లను అందించి సేఫ్టీని మరింత పటిష్టం చేశారు. మార్చి 2026లో ఈ కారు ధరలను ప్రకటించనున్నారు. అయితే ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

Tags

Next Story