Tata Punch : మార్కెట్లోకి కొత్త టాటా పంచ్.. ప్రత్యర్థులకు చెమటలు పట్టించే 3 భారీ మార్పులివే.

Tata Punch : భారతీయ మార్కెట్లో మైక్రో ఎస్‌యూవీల ట్రెండ్‌ను సెట్ చేసిన టాటా పంచ్, ఇప్పుడు సరికొత్త అవతారంలోకి మారింది. టాటా మోటార్స్ నేడు ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. పంచ్ ఇప్పటికీ టాటాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా రికార్డు సృష్టిస్తోంది. ఇప్పుడు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఇందులో మూడు ప్రధాన మార్పులు చేశారు. ఈ మార్పులు మారుతి సుజుకి ఫ్రాంక్స్ లేదా ఇగ్నిస్ వంటి కార్లకు గట్టి పోటీనివ్వనున్నాయి.
1. సరికొత్త డిజైన్ : కొత్త టాటా పంచ్ డిజైన్ ఇప్పుడు పంచ్ ఈవీని పోలి ఉంటుంది. దీని ముందు భాగం పూర్తిగా మారిపోయింది. కొత్తగా రూపొందించిన గ్రిల్, స్టైలిష్ ఎల్ఈడీ లైట్లు, పటిష్టమైన బంపర్ దీనికి బోల్డ్ లుక్‌ను ఇచ్చాయి. వెనుక వైపు కూడా ఎల్ఈడీ లైట్ల డిజైన్‌లో మార్పులు చేశారు. కొత్త కలర్ ఆప్షన్లు, అదిరిపోయే అలాయ్ వీల్స్ ఈ కారు రోడ్ ప్రెజెన్స్‌ను మరింత పెంచుతాయి. కారు కింద భాగంలో సిల్వర్ ఫినిష్ స్కిడ్ ప్లేట్లు ఇవ్వడం వల్ల ఇది ఒక పక్కా ఎస్‌యూవీలా కనిపిస్తోంది.
2. హైటెక్ ఇంటీరియర్ : కారు లోపల కాలు పెడితే మీకు ఒక ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది. డ్యాష్‌బోర్డ్ డిజైన్‌ను ఆధునీకరించారు. ఇందులో ఇప్పుడు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరియు కస్టమర్ల ఫేవరెట్ అయిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. అంతేకాకుండా, 360-డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, టైప్-సి ఛార్జింగ్ పోర్టులు వంటి లగ్జరీ ఫీచర్లను టాటా ఇందులో జోడించింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఆటోమేటిక్ ఏసీని కూడా అప్‌డేట్ చేశారు.
3. కొత్త టర్బో ఇంజిన్ : మెకానికల్ పరంగా జరిగిన అతిపెద్ద మార్పు ఏంటంటే.. పాత 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఇప్పుడు టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల కారు పికప్, పవర్ గణనీయంగా పెరుగుతుంది. గేర్ బాక్స్ విషయానికి వస్తే 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీలతో పాటు కొత్తగా 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లను కూడా ప్రవేశపెట్టారు. స్పీడ్, పవర్ కోరుకునే యువతకు ఇది మంచి ఆప్షన్ కానుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా పంచ్ ధర రూ.5.50 లక్షల నుంచి రూ.9.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. అయితే కొత్త ఫీచర్లు, సన్‌రూఫ్, టర్బో ఇంజిన్ చేరడం వల్ల ధర కొంచెం పెరిగే అవకాశం ఉంది. కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర సుమారు రూ. 6 లక్షల నుంచి మొదలై టాప్ ఎండ్ మోడల్ రూ.9.50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో ఇన్ని ఫీచర్లు ఇస్తుండటంతో, బుకింగ్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

