Tata Tiago EV : బడ్జెట్ ఈవీలో సన్‌రూఫ్? టాటా టియాగో ఈవీ 2026 మోడల్ అదిరిపోయే అప్‌డేట్స్.

Tata Tiago EV : ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్, తన అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ ఈవీ టాటా టియాగో ఈవీని సరికొత్త హంగులతో సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారత రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరా కళ్లకు చిక్కింది. 2026 ద్వితీయార్థంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ కొత్త మోడల్‌లో కేవలం లుక్ మాత్రమే కాదు, రేంజ్, టెక్నాలజీ పరంగా కూడా భారీ మార్పులు ఉండబోతున్నాయి.
డిజైన్ పరంగా చూస్తే.. కొత్త టియాగో ఈవీ మునుపటి కంటే చాలా షార్ప్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా దీని హెడ్‌లైట్స్ డిజైన్ పూర్తిగా మారింది. ఇప్పుడు వస్తున్న కార్ల ట్రెండ్‌కు అనుగుణంగా, ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్‌ను బంపర్ నుంచి మార్చి నేరుగా హెడ్‌లైట్ లోపలే ఐబ్రో తరహాలో అమర్చారు. దీనివల్ల కారుకు ప్రీమియం లుక్ వస్తుంది. అంతేకాకుండా, దీని గ్రిల్, బంపర్ డిజైన్‌ను కూడా గాలి ఒత్తిడిని తట్టుకునేలా మార్చారు, ఇది కారు వేగానికి, రేంజ్‌కు తోడ్పడుతుంది.
కారు వెనుక భాగంలో కూడా ఊహించని మార్పులు ఉండబోతున్నాయి. టెస్టింగ్ మోడల్‌ను గమనిస్తే, ఇందులో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే వెనుక లైట్లు ఒకదానికొకటి కలిసిపోయి రాత్రి వేళల్లో కారుకు స్పోర్టీ లుక్ ఇస్తాయి. అలాగే, 360-డిగ్రీ కెమెరా కోసం పెద్ద సైజులో ఉండే కొత్త మిర్రర్లు, సరికొత్త డిజైన్ కలిగిన అలాయ్ వీల్స్, సెగ్మెంట్లోనే మొదటిసారిగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
సాంకేతికపరంగా చూస్తే.. టాటా తన కొత్త 6-ఇన్-1 ఎలక్ట్రిక్ డ్రైవ్ టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టనుంది. దీనివల్ల కారు బరువు తగ్గి, బ్యాటరీ సామర్థ్యం పెరుగుతుంది. ప్రస్తుతం టియాగో ఈవీ 19.2kWh, 24kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. అయితే 2026 మోడల్‌లో పంచ్ ఈవీలో వాడే 30kWh బ్యాటరీని కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే కారు 315 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. లోపల క్యాబిన్‌లో కూడా కొత్త డిజిటల్ డిస్ప్లే, పెద్ద టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కస్టమర్లను పలకరించనున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
