Changes From Jan 1st: కొత్త ఏడాదిలో వాహనదారులకు షాక్! జనవరి 1 నుంచి అమల్లోకి 3 కొత్త రూల్స్.

Changes From Jan 1st: కొత్త ఏడాదిలో వాహనదారులకు షాక్! జనవరి 1 నుంచి అమల్లోకి 3 కొత్త రూల్స్.
X

Changes From Jan 1st: కొత్త ఏడాది వేడుకల వేళ వాహన ప్రియులకు షాకిచ్చే వార్త ఇది. రేపు అంటే 2026 జనవరి 1 నుంచి ఆటోమొబైల్ రంగంలో మూడు కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మార్పుల వల్ల కొత్తగా బండి కొనాలనుకునే వారి జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. టూ వీలర్ల భద్రత కోసం కొత్త రూల్స్ రావడం ఒకవైపు సంతోషాన్నిస్తున్నా, కార్లు, బైకుల ధరలు పెరుగుతుండటం సామాన్యుడిని కలవరపెడుతోంది.

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2026 నుంచి దేశంలో విక్రయించే అన్ని రకాల ద్విచక్ర వాహనాలకు (స్కూటర్లు, బైకులు, మోపెడ్లు) ఏబీఎస్ తప్పనిసరి. గతంలో కేవలం ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బండ్లకే ఇది ఉండేది, కానీ ఇకపై 100cc బండికైనా సరే ఏబీఎస్ ఉండాల్సిందే. అయితే ఈ నిర్ణయం వల్ల బండ్ల ధరలు భారీగా పెరుగుతాయని, కాబట్టి ఈ రూల్‌ను కాస్త వాయిదా వేయాలని వాహన తయారీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం తగ్గకపోతే, సామాన్యుడు వాడే చిన్న బైకుల ధరలు కూడా పెరగనున్నాయి.

కొత్త ఏడాదిలో కారు కొందామనుకునే వారికి చేదు వార్త. ముడి సరుకుల ధరలు పెరగడం, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావంతో ప్రముఖ కార్ల కంపెనీలు ధరల పెంపును ప్రకటించాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, హోండా, నిస్సాన్, ఎంజీ, రెనాల్ట్ వంటి కంపెనీలు తమ కార్ల ధరలను 2 నుంచి 3 శాతం మేర పెంచుతున్నాయి. ఇటీవల జీఎస్టీ తగ్గింపు వల్ల వచ్చిన లాభం, ఈ ధరల పెంపుతో మాయమైపోనుంది. లగ్జరీ కార్ల నుంచి బడ్జెట్ కార్ల వరకు అన్నింటికీ ఈ ధరల సెగ తగలనుంది.

కేవలం కార్లే కాదు, టూ వీలర్ల ధరలు కూడా జనవరి 1 నుంచి మారుతున్నాయి. ఇప్పటికే అప్రిలియా, ఏథర్ ఎనర్జీ, ట్రయంఫ్ వంటి కంపెనీలు తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఉత్పత్తి వ్యయం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీలు చెబుతున్నాయి. హీరో, టీవీఎస్ వంటి ఇతర పాపులర్ బ్రాండ్లు కూడా త్వరలోనే ధరల పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అంటే, కొత్త ఏడాదిలో ఏ వాహనం కొనాలన్నా అదనంగా కొన్ని వేల రూపాయలు వెచ్చించాల్సిందే.

Tags

Next Story