New Mid-Size SUVs : త్వరలో భారత మార్కెట్‌లోకి 5 కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీలు..మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం.

New Mid-Size SUVs : భారతీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రాబోయే నెలల్లో తీవ్రమైన పోటీ, సందడి కనిపించనుంది. హ్యుందాయ్ క్రెటా, టాటా హారియర్ వంటి మోడళ్లకు పోటీ ఇచ్చేందుకు మొత్తం ఐదు కొత్త మోడళ్లు త్వరలో విడుదల కానున్నాయి. ఈ కొత్త శ్రేణిలో ఐసీఈ ఇంజిన్‌తో నడిచే కొత్త జనరేషన్ కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్, అప్‌డేట్ చేయబడిన స్కోడా కుషాక్ తో పాటు, రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు – టాటా సియెరా ఈవీ, మారుతీ ఈ విటారా ఉండనున్నాయి. ఈ ఎస్‌యూవీలలో లభించే ప్రత్యేక ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొత్త జనరేషన్ కియా సెల్టోస్
సరికొత్త కియా సెల్టోస్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీని డెలివరీలు జనవరి మధ్యలో మొదలయ్యే అవకాశం ఉంది. జనవరి 2, 2026 న దీని అధికారిక ధరలు ప్రకటిస్తారు. పాత మోడల్‌తో పోలిస్తే, 2026 కియా సెల్టోస్ 95 మిమీ పొడవు, 30 మిమీ వెడల్పు, 80 మిమీ ఎక్కువ వీల్‌బేస్‌తో రాబోతోంది. దీని డిజైన్, ముఖ్యంగా ముందు భాగం, కొత్త కియా టెల్లూరైడ్ నుంచి ప్రేరణ పొందింది. కొత్త సెల్టోస్ అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో వస్తున్నప్పటికీ, ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్‌లను కొనసాగించనుంది.
2. కొత్త రెనాల్ట్ డస్టర్
మూడవ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ జనవరి 26, 2026 న భారత మార్కెట్‌లో లాంచ్ కానుంది. మాడ్యులర్ CMF-B ప్లాట్‌ఫారమ్ పై నిర్మితమవుతున్న ఈ ఎస్‌యూవీ, పూర్తిగా కొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్‌తో వస్తుంది. భారతదేశంలో 2026 రెనాల్ట్ డస్టర్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
3. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్
2026 స్కోడా కుషాక్ స్వల్పంగా కాస్మెటిక్ మార్పులతో పాటు కొన్ని ముఖ్యమైన ఫీచర్ అప్‌గ్రేడ్‌లను కూడా పొందనుంది. లీకైన స్పై చిత్రాల ప్రకారం.. అప్‌డేట్ చేయబడిన వెర్షన్‌లో లెవల్ 2 ADAS (అటానమస్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత 1.0 లీటర్, 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌లు కొనసాగుతాయి. అయితే, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ప్రస్తుత 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో భర్తీ చేయనున్నారు.
4. టాటా సియెరా ఈవీ
టాటా సియెరా ఈవీ 2026 మొదటి త్రైమాసికంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని డిజైన్, ఇంటీరియర్ లేఅవుట్, ఫీచర్లు కొన్ని ముఖ్యమైన మార్పులు మినహా ఐసీఈ మోడల్‌ల మాదిరిగానే ఉంటాయి. అధికారిక స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడి కానప్పటికీ, సియెరా ఈవీలో హారియర్ ఈవీలో ఉపయోగించే 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లను అమర్చే అవకాశం ఉంది.
5. మారుతీ ఈ విటారా
2026 ప్రారంభంలో లాంచ్ కానున్న మారుతీ ఈ విటారా మూడు వేరియంట్‌లలో – డెల్టా, జెటా, ఆల్ఫా – అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు 49 kWh, 61 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్లలో చిన్న బ్యాటరీ ప్యాక్ 344 కి.మీ డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తే, పెద్ద బ్యాటరీ ప్యాక్ WLTP సైకిల్ ప్రకారం 542 కి.మీ రేంజ్‌ను ఇవ్వగలదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

