8th Pay Commission: ఒక్క ఫార్ములాతో మారనున్న ఉద్యోగుల జీతం.. ఎంత పెరుగుతుందో తెలుసా?

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న 50 లక్షలకు పైగా ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు ఇప్పుడు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిఫార్సులు అమలులోకి వచ్చిన తర్వాత తమ జీతం ఎంత పెరుగుతుంది అనేదే వారి ప్రధాన ప్రశ్న. ఈ జీతాల పెంపు మొత్తాన్ని నిర్ణయించేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనే ఒకే ఒక్క అంశం. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక గుణకారం. మీ ప్రస్తుత బేసిక్ జీతాన్ని ఈ ఫ్యాక్టర్‌తో గుణించడం ద్వారా కొత్త జీతాన్ని లెక్కిస్తారు. మీడియా నివేదికలు, నిపుణుల అంచనాల ప్రకారం.. ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.86 నుంచి 2.57 మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ సంఖ్యే ఉద్యోగుల జీతంలో స్వల్పంగా పెరుగుదల ఉంటుందా లేక భారీ పెరుగుదల ఉంటుందా అనేది నిర్ణయిస్తుంది.
రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన ఈ కమిషన్ పని కేవలం జీతం పెంచడం మాత్రమే కాదు, ఉద్యోగుల బేసిక్ స్ట్రక్చర్, భత్యాలు, పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా సమీక్షించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం.. కమిషన్ తన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి దాదాపు 18 నెలల సమయం ఉంది. అంటే నివేదిక ఏప్రిల్ 2027 నాటికి ప్రభుత్వానికి చేరుకోవచ్చు. నివేదిక అందిన తర్వాత దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సాధారణంగా 6 నెలల సమయం తీసుకుంటుంది. ఈ టైమ్‌లైన్‌ను బట్టి చూస్తే, కొత్త జీతం, పెన్షన్ విధానం 2027 చివరి నాటికి లేదా 2028 ప్రారంభంలో అమలులోకి వచ్చే బలమైన అవకాశం ఉంది.
ఇక అత్యంత ముఖ్యమైన జీతం పెంపు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న కనిష్ట బేసిక్ జీతం రూ.18,000. ఒకవేళ ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 1.83 వద్ద సెట్ చేస్తే, కొత్త కనీస బేసిక్ జీతం దాదాపు రూ.32,940 అవుతుంది. ఒకవేళ ఈ ఫ్యాక్టర్ 2.46 వరకు పెరిగితే, కనీస బేసిక్ జీతం రూ.44,280 వరకు చేరవచ్చు. ఉదాహరణకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 వద్ద సెట్ చేస్తే, ప్రస్తుతం రూ.8,900 గ్రేడ్ పే ఉన్నవారికి అంచనా నెట్ జీతం రూ.2,89,569 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తంమీద, ఉద్యోగులకు బేసిక్, డియర్‌నెస్ అలవెన్స్ కలిపి 14% నుంచి 54% వరకు వాస్తవ జీతం పెరుగుదల లభించవచ్చని అంచనా. అయితే భారీ పెరుగుదల (54%) ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం మోపుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

