Air India : ఎయిర్ ఇండియా మాస్టర్‌స్ట్రోక్.. ఇక ఒకే టికెట్‌పై రెండు విమానాలలో ప్రయాణం.

Air India : విమాన ప్రయాణాలు చేసే వారికి గుడ్ న్యూస్. భారతదేశపు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, తైవాన్‌కు చెందిన అత్యంత లగ్జరీ విమానయాన సంస్థ స్టార్లక్స్ తో కీలక ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ కొత్త అంతర్-విమాన భాగస్వామ్యం వల్ల ఆసియాలో ప్రయాణించే వారికి కొత్త మార్గాలు తెరచుకోవడమే కాకుండా, వారి ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారనుంది.
ఈ ఒప్పందంలోని ముఖ్య విషయం ఏమిటంటే, ఇకపై ప్రయాణికులు ఎయిర్ ఇండియా, స్టార్లక్స్ విమానాలలో ప్రయాణించడానికి వేర్వేరు టికెట్లు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే టికెట్‌పైనే ఈ రెండు సంస్థల విమానాలలో ప్రయాణించవచ్చు. అంటే, మీ ప్రయాణంలో కొంత భాగం ఎయిర్ ఇండియా విమానంలో మిగతా భాగం స్టార్లక్స్ విమానంలో ఉంటే మొత్తం బుకింగ్ అంతా ఒకే చోట పూర్తవుతుంది. కనెక్టింగ్ విమానాల కోసం తరచుగా వేర్వేరు బుకింగ్‌ల గందరగోళాన్ని ఎదుర్కొనే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పార్టనర్ షిప్ ద్వారా ఎయిర్ ఇండియా ప్రయాణికులు హాంకాంగ్, బ్యాంకాక్, సింగపూర్, హో చి మిన్ సిటీ, కౌలాలంపూర్ వంటి నగరాల మీదుగా నేరుగా తైవాన్ రాజధాని తైపేకు చేరుకోవచ్చు. అదేవిధంగా, స్టార్లక్స్ విమానాలలో ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులు కూడా ఈ నగరాల ద్వారా భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులకు నేరుగా ప్రయాణించవచ్చు.
స్టార్లక్స్ విమానయాన సంస్థ అద్భుతమైన సర్వీసులతో పాపులారిటీ సంపాదించుకుంది. తైవాన్ నుంచి అమెరికా, జపాన్, ఆగ్నేయాసియాలోని 30కి పైగా మార్గాలలో ఇది సేవలు అందిస్తుంది. ఎయిర్ ఇండియా ముఖ్య వాణిజ్య అధికారి నిపుణ్ అగర్వాల్ ఈ ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది తమ ప్రయాణికులకు ప్రీమియం, ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించాలనే తమ నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు. ఈ భాగస్వామ్యంలో మరొక ముఖ్య ప్రయోజనం లగేజ్ బదిలీకి సంబంధించింది. అనుసంధాన విమానాలలో సామానును మళ్లీ తనిఖీ చేయించాల్సిన గొడవ ఇక ఉండదు. మీ సామాను నేరుగా మీ తుది గమ్యస్థానానికి చేరుతుంది. ఇది ప్రయాణ సమయంలో ఉండే పెద్ద సమస్యను పరిష్కరిస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com