Campa Sure : బిగ్ బి చేతికి అంబానీ నీళ్ల బాటిల్.. బిస్లరీ కోట బద్దలు కావడం ఖాయమేనా?

Campa Sure : బిజినెస్ దిగ్గజం ముకేశ్ అంబానీ మరో సంచలనానికి తెరలేపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ద్వారా ప్యాకేజ్డ్ తాగునీటి మార్కెట్‌లోకి క్యాంపా ష్యూర్ బ్రాండ్‌తో ఎంట్రీ ఇచ్చారు. దీనికి తోడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ ఎఫ్‌ఎమ్‌సిజి రంగంలో తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమైంది. సామాన్యుడి దాహం తీర్చే తాగునీటి వ్యాపారంలోకి క్యాంపా ష్యూర్ బ్రాండ్‌తో అడుగుపెట్టింది. ఈ బ్రాండ్ ప్రచారం కోసం అమితాబ్ బచ్చన్‌ను రంగంలోకి దించింది. ఇప్పటికే కోలా డ్రింక్స్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన రిలయన్స్, ఇప్పుడు తాగునీటి రంగంలోనూ నాణ్యత ఎక్కువ - ధర తక్కువ అనే ఫార్ములాతో దూసుకుపోతోంది. బిస్లరీ, కిన్లే, ఆక్వాఫినా వంటి దిగ్గజ బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, క్యాంపా ష్యూర్ ధరలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర పాపులర్ బ్రాండ్‌ల కంటే సుమారు 20 నుంచి 30 శాతం తక్కువగా ఉండబోతున్నాయి. అమితాబ్ బచ్చన్ వంటి అత్యంత ఆదరణ ఉన్న వ్యక్తి ఈ బ్రాండ్‌కు తోడవడంతో, వినియోగదారుల్లో నమ్మకం ఇట్టే ఏర్పడుతుందని అంబానీ వ్యూహం. ఒకవైపు తక్కువ ధర, మరోవైపు బిగ్ బి క్రేజ్.. ఈ రెండూ కలిసి నీళ్ల మార్కెట్‌లో రిలయన్స్‌ను తిరుగులేని శక్తిగా మార్చనున్నాయి.
రిలయన్స్ తన ప్రచార బాధ్యతలను కేవలం ఒకరికే పరిమితం చేయలేదు. గత ఏడాది ఐపీఎల్ సమయంలో సౌత్ సూపర్ స్టార్ రామ్ చరణ్‌ను తన కోలా బ్రాండ్ కోసం ఎంచుకుంది. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మోటార్ స్పోర్ట్ టీమ్‌తో కూడా ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్‌ను తాగునీటి బ్రాండ్ కోసం తీసుకురావడంతో, సినిమా, క్రీడా రంగాల్లోని దిగ్గజాలను తన వ్యాపార ఎదుగుదల కోసం రిలయన్స్ వాడుకుంటోందని స్పష్టమవుతోంది.
నీళ్ల వ్యాపారంలో అంబానీ ఇంత వేగంగా అడుగులు వేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఒక కారణం. గతేడాది సెప్టెంబర్‌లో మినరల్ వాటర్ పై జీఎస్టీని 18 శాతం నుంచి ఏకంగా 5 శాతానికి తగ్గించడంతో కంపెనీలకు భారీ ఊరట లభించింది. ఈ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తూ, అగ్రస్థానంలో ఉన్న కంపెనీల సామ్రాజ్యాన్ని ఢీకొట్టేందుకు రిలయన్స్ సిద్ధమైంది. 80 ఏళ్లు దాటినా నేటికీ యాడ్స్ ప్రపంచంలో అమితాబ్ బచ్చన్ నంబర్ వన్ అని, ఆయన బ్రాండ్ ఇమేజ్ ఈ కొత్త వెంచర్‌కు భారీగా కలిసివస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

