Ather Rizta : రికార్డు బ్రేక్.. ఆరు నెలల్లోనే 2 లక్షల యూనిట్లతో రిజ్జా సంచలనం.

Ather Rizta : రికార్డు బ్రేక్.. ఆరు నెలల్లోనే 2 లక్షల యూనిట్లతో రిజ్జా సంచలనం.
X

Ather Rizta : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో కొన్ని మోడళ్లు అసాధారణమైన పనితీరును కనబరుస్తున్నాయి. ఈ జాబితాలో ఎథర్ రిజ్టా కూడా ఉంది. తాజాగా రిజ్టా కేవలం ఆరు నెలల కాలంలోనే 2 లక్షల అమ్మకాల మైల్‌స్టోన్‌ను చేరుకొని రికార్డు సృష్టించింది. గత మే 2025 లో ఈ మోడల్ లక్ష యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. ఈ ఫ్యామిలీ స్కూటర్ ఇప్పుడు కంపెనీ మొత్తం అమ్మకాలలో 70% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది.

ఏప్రిల్ 2024 లో విడుదలైన రిజ్టా, ఎథర్ పట్టును దక్షిణ భారతదేశం నుంచి మరింత ముందుకు తీసుకెళ్లి, మధ్య, ఉత్తర భారతదేశంలో కూడా బలోపేతం చేసింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఫైనాన్షియల్ ఇయర్ 2026 మొదటి త్రైమాసికంలో 7% ఉన్న మార్కెట్ వాటా, మూడవ త్రైమాసికంలో 14% కి పెరిగింది. ఇదే విధంగా పంజాబ్‌లో 8% నుంచి 15% కి, ఉత్తరప్రదేశ్‌లో 4% నుంచి 10% కి అమ్మకాలు పెరిగాయి.

ఈ స్కూటర్ విజయానికి ముఖ్య కారణాలలో కొత్త వేరియంట్ల విడుదల ఒకటి. ముఖ్యంగా టెర్రకోట రెడ్ రంగు ఆప్షన్, 3.7 kWh బ్యాటరీ కలిగిన రిజ్టా ఎస్ మోడల్ ప్రజాదరణ పొందాయి. రిజ్టా ఎస్, రిజ్టా జెడ్ రెండూ 123 కి.మీ, 159 కి.మీ IDC రేంజ్‌లను అందిస్తాయి. వీటిలో 56 లీటర్ల భారీ స్టోరేజ్ సామర్థ్యం, అలాగే స్కిడ్ కంట్రోల్, ఫాల్ సేఫ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ఈ స్కూటర్ రూ.1.22 లక్షల ఆన్‌రోడ్ ధరతో ప్రారంభమై, టాప్ మోడల్‌కు రూ.1.75 లక్షల వరకు ఉంటుంది.

రిజ్టా లాంచ్ అయినప్పటి నుంచి, ఎథర్ తన రిటైల్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించింది. సెప్టెంబర్ 30, 2025 నాటికి, కంపెనీ 524 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లకు చేరుకుంది. అంతేకాకుండా కంపెనీ ఇటీవల దేశవ్యాప్తంగా 5 లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన మైల్‌స్టోన్‌ను కూడా అధిగమించింది. ఎథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకేలా మాట్లాడుతూ.. రిజ్టా తమ మార్కెట్‌ను విస్తరించడంలో ముఖ్యంగా మధ్య, ఉత్తర భారతదేశంలో పంపిణీని పెంచడంలో సహాయపడిందని తెలిపారు. కంపెనీ తమ పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది.

ఎథర్ ఎనర్జీ 2013 లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్లను తయారు చేయడంతో పాటు, దేశంలో అతిపెద్ద టూ-వీలర్ ఫాస్ట్-ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 4,322 చార్జర్‌లు ఉన్నాయి. రిజ్టా ఇప్పుడు నేపాల్, శ్రీలంక వంటి ఎథర్ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంది.

Tags

Next Story