India-US Trade Deal : ప్రపంచాన్ని శాసించబోతున్న భారత ఆటో కంపెనీలు..అమెరికా మార్కెట్లపై దండయాత్ర.

India-US Trade Deal : భారత ఆటోమొబైల్ రంగానికి అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలతో భారత్ కుదుర్చుకున్న సరికొత్త వాణిజ్య ఒప్పందాలు మన దేశ ఆటో విడిభాగాల పరిశ్రమకు కొండంత అండగా నిలవనున్నాయి. ఈ ఒప్పందాల వల్ల విదేశీ మార్కెట్లలో భారతీయ కంపెనీలకు భారీ అవకాశాలు లభించనున్నాయి. ఇదే ఉత్సాహం ఢిల్లీలో జరుగుతున్న ACMA Automechanika 6వ ఎడిషన్ ఎక్స్‌పోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ దిగ్గజాలు, సప్లయర్లు ఇప్పుడు భారత్ వైపు ఆశగా చూస్తున్నారు.
అమెరికా, యూరోపియన్ యూనియన్‌లతో జరిగిన వాణిజ్య ఒప్పందాలు భారతీయ ఆటో విడిభాగాల తయారీదారులకు ఒక వరం లాంటివి. ఈ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల భారతీయ ఉత్పత్తులకు విదేశీ మార్కెట్లలో పన్ను రాయితీలు లభిస్తాయి. స్టీల్‌బర్డ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మానవ్ కపూర్ ప్రకారం, మన దేశ ఆటో విడిభాగాల ఉత్పత్తిలో సుమారు 30 శాతం విదేశాలకే ఎగుమతి అవుతోంది. ఇప్పుడు కుదిరిన కొత్త ఒప్పందాల వల్ల ఈ శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది. రబ్బర్ పార్ట్స్, ఫిల్టర్లు వంటి విడిభాగాలకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత ఆటో విడిభాగాల పరిశ్రమ చెక్కుచెదరకుండా ఉంది. ACMA ప్రెసిడెంట్ విక్రమ్ రాఘుపతి సింఘానియా తెలిపిన వివరాల ప్రకారం.. భారత ఆటో కాంపోనెంట్ పరిశ్రమ విలువ దాదాపు 80 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.6.6 లక్షల కోట్లు) చేరుకుంది. సప్లై చైన్ లోటుపాట్లు, ద్రవ్యోల్బణం, మారుతున్న టెక్నాలజీ వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, మన కంపెనీలు పెట్టుబడులను కొనసాగిస్తూ తమ గ్లోబల్ నెట్‌వర్క్‌ను పెంచుకుంటున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న ఆటోమెకానికా ఎక్స్‌పో దీనికి నిదర్శనంగా నిలిచింది.
కేవలం సంప్రదాయ విడిభాగాలే కాకుండా, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల తయారీలో కూడా భారత్ అగ్రస్థానానికి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలు ఇప్పుడు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్నాయి. అమెరికా, యూరప్ ఒప్పందాల వల్ల ఈ సెగ్మెంట్లో భారత కంపెనీలకు భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక సాంకేతికతను జోడించి విడిభాగాలను తయారు చేయడం వల్ల గ్లోబల్ వాల్యూ చైన్ లో భారత్ ఒక కీలక భాగస్వామిగా మారుతోంది. మొత్తానికి భారత ఆటోమొబైల్ రంగం ఇప్పుడు గ్లోబల్ హబ్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
