Budget 2026 : ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్స్‌ట్రా పవర్..బడ్జెట్ పై ఈవీ కంపెనీల భారీ ఆశలు.

Budget 2026 : ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. గతేడాది తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఆటోమొబైల్ రంగం ఇప్పటికే మంచి జోష్‌లో ఉంది. వాహనాల ధరలు తగ్గడంతో అమ్మకాలు పెరిగాయి. అయితే ఈ జోరు ఇలాగే కొనసాగాలంటే బడ్జెట్‌లో మరిన్ని బూస్టర్ డోసులు కావాలని వాహన తయారీదారులు కోరుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు, సామాన్యులు వాడే టూ-వీలర్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం ఒక క్లీన్ పాలసీ కోసం ఎదురుచూస్తోంది. వాహనాల తయారీ అనేది భారీ పెట్టుబడులతో కూడుకున్న పని కావడంతో, ప్రభుత్వం తరచూ నిబంధనలు మార్చకుండా ఉండాలని కంపెనీలు కోరుతున్నాయి. స్థిరమైన పాలసీ ఉంటేనే విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని, కొత్త టెక్నాలజీని భారత్‌కు తీసుకురావడం సులభం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వాహనాలపై పన్నులు తగ్గించిన ప్రభుత్వం, ఈసారి ఆ ప్రయోజనాలను హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా విస్తరించాలని డిమాండ్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ, ఛార్జింగ్ స్టేషన్ల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. బడ్జెట్‌లో పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీ కేటాయింపులు చేయాలని ఈవీ తయారీదారులు కోరుతున్నారు. కైనిటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ ఎండీ అజింక్య ఫిరోడియా మాట్లాడుతూ.. పీఎం ఈ-డ్రైవ్ వంటి పథకాలను కొనసాగించడమే కాకుండా, పాత వాహనాలను తుక్కు కింద మార్చి ఈవీ కొనేవారికి మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. కాలుష్య ఆధారిత పన్నులను ప్రవేశపెట్టి, పర్యావరణహిత వాహనాలకు చేయూతనివ్వాలని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, టూ-వీలర్ సెగ్మెంట్ కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్, ట్రయంఫ్ వంటి బైకులపై అధిక పన్నుల భారం పడుతోంది. దీనివల్ల మధ్యతరగతి యువత ఈ బైకులకు దూరమవుతున్నారు. చిన్న ఇంజిన్ గల సాధారణ బైకులపై కూడా జీఎస్టీ రేట్లు ఒకేలా ఉండాలని, తద్వారా సామాన్యులకు బైకులను అందుబాటులోకి తేవాలని ఇండస్ట్రీ కోరుతోంది. అలాగే, రోడ్డు భద్రతకు సంబంధించి హెల్మెట్ తయారీదారులు కూడా స్థానిక తయారీని ప్రోత్సహించేలా పన్ను మినహాయింపులు ఆశిస్తున్నారు.
భారత్‌ను గ్లోబల్ ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలంటే కేవలం వాహనాల తయారీనే కాకుండా, వాటి విడిభాగాల తయారీని కూడా పెంచాలి. ఆటో కాంపోనెంట్స్ తయారీలో భారత్ ఇప్పటికే ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకుందని ఆర్ఎస్బి గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజనీకాంత్ బెహెరా తెలిపారు. కస్టమ్ డ్యూటీలో మార్పులు, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం తక్కువ వడ్డీకే రుణాలు వంటి సౌకర్యాలు కల్పిస్తే.. విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, స్వదేశీ తయారీకి బలం చేకూరుతుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
