Amazon : భారతదేశ టెక్ భవిష్యత్తు హైదరాబాద్ నుంచే..అమెజాన్‎తో రూ.63,000 కోట్ల భారీ డీల్.

Amazon : భారతదేశ టెక్ భవిష్యత్తు హైదరాబాద్ నుంచే..అమెజాన్‎తో రూ.63,000 కోట్ల భారీ డీల్.
X

Amazon : టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో తమ పెట్టుబడుల వేగాన్ని మరింత పెంచింది. భారత్‌లో $35 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన వెంటనే, ఆ సంస్థ క్లౌడ్ సర్వీస్ కంపెనీ అయిన ఏడబ్ల్యూఎస్ (Amazon Web Services), తెలంగాణ ప్రభుత్వంతో ఒక కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. AWS రాబోయే 14 సంవత్సరాలలో హైదరాబాద్‌లోని తమ క్లౌడ్ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి ఏకంగా $7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.63,000 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.

AWS చేపట్టిన ఈ కొత్త $7 బిలియన్ డాలర్ల పెట్టుబడి, గతంలో చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ఉంది. AWSకి ముంబై తర్వాత భారతదేశంలో ఇది రెండవ అతిపెద్ద డేటా సెంటర్ రీజియన్, దీనిని 2022లో హైదరాబాద్‌లో ప్రారంభించారు. ప్రారంభంలో కంపెనీ $4.4 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రకటించగా ఇప్పుడు అదనంగా ప్రకటించిన $7 బిలియన్ డాలర్లతో, హైదరాబాద్ రీజియన్ దేశవ్యాప్తంగా క్లౌడ్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్‌లు, ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్‌లకు ఒక బలమైన టెక్నాలజీ హబ్‌గా మారబోతోంది.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, AWS మధ్య ఈ కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం డేటా సెంటర్ల నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పూర్తి సహాయాన్ని AWSకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ పెట్టుబడిని తెలంగాణ ఎదుగుతున్న సామర్థ్యానికి నిదర్శనంగా అభివర్ణించారు. "అమెజాన్ వంటి దిగ్గజాలు మా ప్రభుత్వ స్థిరత్వం, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ విజన్‌ను నమ్ముతున్నారని ఈ పెట్టుబడి చూపిస్తుంది" అని ఆయన అన్నారు.

ఈ భారీ విస్తరణ వల్ల హైదరాబాద్ భారతదేశ డేటా సెంటర్ రాజధానిగా మారుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, ఆవిష్కరణలు, AI, డిజిటల్ మౌలిక సదుపాయాల దిశగా పెద్ద ఊపు లభిస్తుంది. AWS ఇండియా అధ్యక్షుడు సందీప్ దత్తా మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారతదేశ డిజిటల్ పురోగతికి అమెజాన్ నిబద్ధతను తెలియజేస్తుందని, తెలంగాణను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే కలను బలోపేతం చేస్తుందని అన్నారు.

Tags

Next Story