Bank Strike : 12న బ్యాంకులకు తాళం.. సామాన్యులకు తప్పని తిప్పలు.

Bank Strike : 12న బ్యాంకులకు తాళం.. సామాన్యులకు తప్పని తిప్పలు.
X

Bank Strike : బ్యాంకు పనుల కోసం ఫిబ్రవరి 12వ తేదీన ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఫిబ్రవరి 12, 2026 (గురువారం) నాడు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న కొత్త కార్మిక చట్టాలకు నిరసనగా పలు ప్రధాన బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనివల్ల ఆ రోజు మీ బ్యాంక్ పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది.

సమ్మెకు కారణం ఏంటి?

ముఖ్యంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వంటి దిగ్గజ సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన 4 కొత్త లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఈ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 29 పాత చట్టాలను కలిపి చేస్తున్న ఈ మార్పులు ఉద్యోగులకు నష్టదాయకమని వారు వాదిస్తున్నారు. అంతేకాకుండా, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 5 డేస్ వర్క్ వీక్ (వారానికి ఐదు రోజులే పని) డిమాండ్‌ను కూడా ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు కోరుతున్నారు.

బ్యాంకులు పూర్తిగా మూతపడతాయా?

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రిజర్వ్ బ్యాంక్ గానీ, ప్రభుత్వం గానీ ఆ రోజును సెలవు దినంగా ప్రకటించలేదు. అంటే బ్యాంకులు అధికారికంగా తెరిచే ఉంటాయి. కానీ, సిబ్బంది మెజారిటీ భాగం సమ్మెలో పాల్గొంటే లోపల పనులు జరగడం కష్టమవుతుంది. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకులు తమ కార్యకలాపాలకు అంతరాయం కలగవచ్చని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ముందస్తు సమాచారం ఇచ్చాయి. డిపాజిట్లు, విత్ డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ వంటి పనులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.

మీరు ఏం చేయాలి?

బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లే పనులు ఏవైనా ఉంటే ఫిబ్రవరి 12 కంటే ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేదా ఆ తర్వాత రోజుకు వాయిదా వేసుకోండి. అయితే, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ మరియు ఏటీఎం సేవలు మాత్రం యధావిధిగా కొనసాగే అవకాశం ఉంది. కానీ, కొన్ని చోట్ల ఏటీఎంలలో నగదు కొరత రావచ్చు, కాబట్టి అవసరమైనంత క్యాష్ ముందే దగ్గర పెట్టుకోవడం మంచిది.

Tags

Next Story