Car Modification : బేస్ మోడల్ కారు కొని టాప్ మోడల్ గా మారుస్తున్నారా? వారెంటీకి టాటా చెప్పాల్సిందే.

Car Modification : భారతదేశం లాంటి ధరల విషయంలో ఆచితూచి వ్యవహరించే మార్కెట్‌లో, చాలామంది కార్ల కొనుగోలుదారులు ఒక తెలివైన ప్లాన్ వేస్తుంటారు. షోరూమ్‌లో కారు కొనేటప్పుడు తక్కువ ధరలో వచ్చే బేస్ మోడల్ కొనుగోలు చేసి, ఆ తర్వాత బయట లోకల్ మార్కెట్‌లో తమకు నచ్చిన ఫీచర్లను తక్కువ ధరకే అమర్చుకుంటారు. దీనినే టెక్నికల్ భాషలో బేస్-టు-టాప్ కన్వర్షన్ అంటారు. టచ్‌స్క్రీన్లు, అల్లాయ్ వీల్స్, లెదర్ సీట్లు, కలర్ ఫుల్ లైటింగ్.. ఇలా ఒకటేమిటి కారు రూపురేఖలనే మార్చేస్తారు. పైకి చూడటానికి ఇది లాభదాయకంగా అనిపించినప్పటికీ, దీని వెనుక కొన్ని ప్రమాదకరమైన కోణాలు ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కంపెనీ గ్యారెంటీ ఉండదు
బయట మార్కెట్‌లో యాక్సెసరీస్ అమర్చుకోవడం వల్ల కలిగే అతిపెద్ద నష్టం కారు వారెంటీపై పడుతుంది. కారు తయారీ కంపెనీలు తాము ఇచ్చే వారెంటీ విషయంలో చాలా కఠినంగా ఉంటాయి. మీరు లోకల్ షాపుల్లో ఎల్‌ఈడీ లైట్లు లేదా భారీ సౌండ్ సిస్టమ్ పెట్టించేటప్పుడు కారు వైర్లను కట్ చేసినా లేదా మార్చినా, కారు ఎలక్ట్రికల్ వారెంటీ వెంటనే రద్దవుతుంది. భవిష్యత్తులో కారులో ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా లేదా ఇంజన్ సమస్యలు వచ్చినా, కంపెనీలు బాధ్యత వహించవు. చివరకు కారు ఈసీయూ రీ మ్యాపింగ్ చేయడం వల్ల ఇంజన్, ట్రాన్స్‌మిషన్ వారెంటీ కూడా ప్రమాదంలో పడుతుంది.
అమ్మేటప్పుడు రేటు రాదు
చాలామంది తమ కారుకు లక్షల రూపాయల విలువైన యాక్సెసరీస్ పెడితే, కారు అమ్మేటప్పుడు ఎక్కువ ధర వస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంటుంది. కారు కొనే సెకండ్ హ్యాండ్ బయ్యర్లు ఎప్పుడూ స్టాక్ కారు (కంపెనీ ఫిట్టింగ్‌తో ఉన్న కారు)నే ఇష్టపడతారు. బయట మోడిఫికేషన్లు చేసిన కార్లు అంత నమ్మకమైనవి కావని, వాటిని మెయింటెనెన్స్ చేయడం కష్టమని భావిస్తారు. మీరు బయట పెట్టిన యాక్సెసరీస్ విలువ కాలక్రమేణా వేగంగా పడిపోతుంది, దీనివల్ల మీరు పెట్టిన పెట్టుబడికి సరైన ప్రతిఫలం దక్కదు.
చట్టపరమైన చిక్కులు
లోకల్ మార్కెట్‌లో చేసే ఫిట్టింగ్‌లు ఫ్యాక్టరీ ఫిట్టింగ్‌లంత పక్కాగా ఉండవు. సరిగ్గా అమర్చని సన్‌రూఫ్ వల్ల వర్షం వచ్చినప్పుడు నీరు లోపలికి కారడం, ప్యానెళ్ల నుంచి శబ్దాలు రావడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా, భారతదేశంలో భారీ శబ్దం చేసే ఎగ్జాస్ట్‌లు, అతి వెలుతురునిచ్చే హై-ఇంటెన్సిటీ లైట్లు, కారు స్ట్రక్చర్‌ను మార్చడం వంటివి చట్టరీత్యా నేరం. ఒకవేళ మీరు చేసిన మోడిఫికేషన్ల గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పకపోతే, ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ పొందే అవకాశం కూడా ఉండదు.
నిజానికి కారును ఎక్కువ కాలం వాడుకోవాలని అనుకునేవారు, ప్రారంభంలోనే కాస్త ఎక్కువ ధర చెల్లించి పై వేరియంట్లను కొనుగోలు చేయడం ఉత్తమం. ఫ్యాక్టరీలో అమర్చిన ఫీచర్లు కారుతో కలిసి పక్కాగా పని చేయడమే కాకుండా, వారెంటీ పరిధిలో మీకు భద్రతనిస్తాయి. ఒకవేళ మీరు మోడిఫికేషన్లు చేయాలనుకుంటే, కేవలం ప్లగ్ అండ్ ప్లే యాక్సెసరీలను మాత్రమే ఎంచుకోండి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
