Basmati Rice : ఇరాన్ టెన్షన్‌తో భారత్‌లో బాస్మతి బియ్యం ధరలు ఢమాల్..కిలోకు రూ.10 వరకు తగ్గింపు!

Basmati Rice : మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సాధారణంగా యుద్ధం వస్తే వస్తువుల ధరలు పెరుగుతాయి, కానీ భారతదేశంలో మాత్రం విచిత్రంగా బాస్మతి బియ్యం ధరలు తగ్గిపోతున్నాయి. దీనికి కారణం మన దేశం నుంచి ఇరాన్‌కు జరిగే భారీ ఎగుమతులకు బ్రేకులు పడటమే. ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ ప్రకారం.. ఇరాన్‌లో జరుగుతున్న అల్లర్లు, యుద్ధ భయాల వల్ల గత వారం రోజుల్లోనే బాస్మతి బియ్యం ధర కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గింది.
ఎగుమతులు ఆగిపోవడానికి కారణం ఏంటి?
భారతదేశం నుంచి బాస్మతి బియ్యాన్ని దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో ఇరాన్ ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి నవంబర్ మధ్యే దాదాపు రూ.4,225 కోట్ల విలువైన బియ్యాన్ని మనం అక్కడికి పంపాము. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి వ్యాపారులు పేమెంట్స్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. షిప్‌మెంట్‌లు కూడా సకాలంలో చేరడం లేదు. దీనివల్ల ఎగుమతిదారులు తమ సరుకును ఇరాన్‌కు పంపడానికి భయపడుతున్నారు. విదేశాలకు వెళ్లాల్సిన స్టాక్ అంతా స్థానిక మార్కెట్లలోనే ఉండిపోవడంతో దేశీయంగా ధరలు పడిపోతున్నాయి.
అమెరికా ఆంక్షల సెగ.. ఎగుమతిదారులకు హెచ్చరిక
ఇరాన్ టెన్షన్‌తో పాటు అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా భారతీయ బియ్యం వ్యాపారులను కలవరపెడుతున్నాయి. ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించే దేశాలపై 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా హెచ్చరించింది. నిజానికి, భారతీయ బియ్యంపై అమెరికా ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధిస్తోంది, ఇది గతంలో ఉన్న 10 శాతం కంటే చాలా ఎక్కువ. ఈ పరిణామాల నేపథ్యంలో IREF జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ప్రేమ్ గార్గ్ ఎగుమతిదారులకు కీలక సూచనలు చేశారు. ఇరాన్‌తో చేసుకున్న పాత కాంట్రాక్టులను మరోసారి రివ్యూ చేసుకోవాలని, పేమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
రైతులు మరియు సామాన్యులపై ప్రభావం
ధరలు తగ్గడం సామాన్య వినియోగదారులకు శుభవార్తే అయినప్పటికీ, బాస్మతి పండించే రైతులకు మాత్రం ఇది ఆందోళన కలిగించే విషయమే. మార్కెట్‌లో ధరలు తగ్గిపోవడంతో రైతులకు ఆశించిన లాభం అందడం లేదు. ఎగుమతులు మళ్లీ పుంజుకుంటే తప్ప ధరలు స్థిరపడవు. అప్పటివరకు బాస్మతి బియ్యం ప్రియులకు తక్కువ ధరకే కింగ్ ఆఫ్ రైస్ అందుబాటులో ఉండనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

