Car AC Tips : కారు ఏసీ కూలింగ్ తగ్గిందా? ఈ చిన్న ట్రిక్స్‌తో మీ కారు ఐస్‌లా మారిపోతుంది.

Car AC Tips : ఎండలు మండిపోతున్నాయి.. కారు బయట ఉంటే చాలు నిప్పుల కొలిమిలా తయారవుతోంది. ఇలాంటి టైంలో కారు ఏసీ సరిగ్గా పనిచేయకపోతే ప్రయాణం నరకప్రాయమే. ఏసీ కూలింగ్ తగ్గగానే చాలామంది గ్యాస్ అయిపోయిందని లేదా ఏదో పెద్ద రిపేర్ వచ్చిందని కంగారు పడి మెకానిక్ దగ్గరికి పరిగెడతారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ కారు ఏసీ మంచుకొండలా చల్లటి గాలిని ఇస్తుంది.మీ కారు ఏసీ చిల్లుగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
ముందు వేడి గాలిని బయటకు పంపండి
ఎండలో పార్క్ చేసిన కారు లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కారు ఎక్కగానే ఏసీ ఫుల్ పెట్టి కిటికీలు క్లోజ్ చేయడం పెద్ద తప్పు. కారు స్టార్ట్ చేయగానే ముందుగా అద్దాలన్నీ దించేయాలి. ఒక రెండు నిమిషాల పాటు వేడి గాలి బయటకు వెళ్లేలా చూడాలి. ఆ తర్వాత ఏసీ ఆన్ చేసి, కాసేపటికి అద్దాలు క్లోజ్ చేస్తే కూలింగ్ చాలా త్వరగా అవుతుంది. దీనివల్ల ఏసీ కంప్రెషర్‌పై భారం కూడా తగ్గుతుంది.
రీసర్క్యులేషన్ మోడ్ వాడండి:
కారు లోపల ఏసీ ఆన్ చేసినప్పుడు రీసర్క్యులేషన్ మోడ్ ఆన్ చేయడం చాలా ముఖ్యం. ఇది బయట ఉన్న వేడి గాలిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. లోపల ఉన్న చల్లటి గాలినే మళ్ళీ మళ్ళీ సర్క్యులేట్ చేయడం వల్ల క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. అలాగే, ఏసీ ఫ్యాన్ స్పీడ్‌ను మొదట ఎక్కువగా ఉంచి, కారు చల్లబడిన తర్వాత మీడియంకు మార్చుకోవడం వల్ల ఏసీ లైఫ్ పెరుగుతుంది.
ఫిల్టర్ల శుభ్రత - కూలింగ్ రహస్యం
చాలామంది చేసే పొరపాటు ఏసీ ఫిల్టర్లను పట్టించుకోకపోవడం. దుమ్ము, ధూళి వల్ల ఏసీ ఫిల్టర్ బ్లాక్ అయితే గాలి రావడం తగ్గిపోతుంది. ఎప్పటికప్పుడు ఫిల్టర్లను శుభ్రం చేయడం లేదా అవసరమైతే మార్చడం వల్ల గాలి ప్రవాహం బాగుంటుంది. అలాగే కారు ముందు భాగంలో ఉండే కండెన్సర్ దగ్గర మట్టి పేరుకుపోకుండా వాటర్ సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి. కండెన్సర్ క్లీన్‌గా ఉంటేనే ఉష్ణ మార్పిడి సరిగ్గా జరిగి చల్లదనం పెరుగుతుంది.
పార్కింగ్‌లో జాగ్రత్తలు
వీలైనంత వరకు కారును నీడలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. నీడ లేని చోట పార్క్ చేయాల్సి వస్తే సన్‌షైడ్స్ వాడండి. దీనివల్ల డాష్ బోర్డ్ వేడెక్కకుండా ఉంటుంది. కారు లోపల వేడి తక్కువగా ఉంటే ఏసీకి పని తక్కువ అవుతుంది. అలాగే ఏడాదికి ఒకసారి ఏసీ గ్యాస్ లెవల్స్‌ను తనిఖీ చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఏసీ నుంచి ఏవైనా వింత శబ్దాలు వస్తుంటే వెంటనే మెకానిక్‌ను సంప్రదించాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
