7 Seater Cars : ఫ్యామిలీ అంతా కలిసి జాలీగా వెళ్లొచ్చు..20 లక్షల లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు ఇవే.

7 Seater Cars : ఫ్యామిలీ అంతా కలిసి ఒకే కారులో ట్రిప్‌కు వెళ్లడం అంటే ఆ మజానే వేరు. అందుకే ఇప్పుడు మార్కెట్‌లో 7-సీటర్ కార్లకు, ముఖ్యంగా ఎమ్‌పీవీలకు డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం ఒక మంచి 7-సీటర్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ 20 లక్షల లోపే ఉందా? అయితే మీకోసం మార్కెట్‌లో అదిరిపోయే ఆప్షన్లు ఉన్నాయి. కేవలం స్పేస్ మాత్రమే కాదు, ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్లతో అలరిస్తున్న టాప్ 5 కార్ల వివరాలు తెలుసుకుందాం.
మారుతీ సుజుకి ఎర్టిగా
మధ్యతరగతి కుటుంబాలకు మొదటి ఛాయిస్ ఎప్పుడూ ఎర్టిగానే. దీని ప్రారంభ ధర రూ.8.80 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 101 HP పవర్‌ను ఇస్తుంది. ముఖ్యంగా మైలేజీ కోరుకునే వారికి సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌లతో వచ్చే ఈ కారులో 209 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ కంఫర్ట్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
కియా కారెన్స్
స్టైలిష్ లుక్ , లగ్జరీ ఫీచర్లు కావాలనుకునే వారికి కియా కారెన్స్ సరైన జోడి. దీని ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో పెట్రోల్, డీజిల్.. రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ 113 HP పవర్, 250 Nm టార్క్‌ను ఇస్తుంది. 45 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 216 లీటర్ల బూట్ స్పేస్‌తో ఈ కారు లాంగ్ ట్రిప్స్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. సేఫ్టీ ఫీచర్లలో కూడా కియా ఎక్కడా తగ్గదు.
మహీంద్రా స్కార్పియో-ఎన్
ఎస్‌యూవీకి ఉన్నంత పవర్, ఎమ్‌పీవీకి ఉన్నంత స్పేస్ కావాలంటే స్కార్పియో-ఎన్ వైపు చూడాల్సిందే. దీని ధర రూ.13.49 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ ఏకంగా 200 HP పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 786 లీటర్ల భారీ బూట్ స్పేస్ దీని హైలైట్. ఎంత మందిని ఎక్కించినా, ఎంత లగేజీ పెట్టినా స్కార్పియో-ఎన్ అస్సలు తగ్గదు.
మహీంద్రా XUV 700
లేటెస్ట్ టెక్నాలజీ, ADAS వంటి ఫీచర్లతో వచ్చే XUV 700 ధర రూ.13.66 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఉన్న 2.0 లీటర్ TGDi ఇంజిన్ 170 HP పవర్‌ను ఇస్తుంది. ఇంటీరియర్ పరంగా ఇది చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఫ్యామిలీ సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి, హై-టెక్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్ ఒక వరమని చెప్పవచ్చు. ఇందులో 240 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్
నమ్మకానికి మారుపేరు టయోటా. ఇక ఇన్నోవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నోవా హైక్రాస్ ధర రూ.18.33 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. హైబ్రిడ్ మోడల్ 183.7 HP పవర్‌ను ఇస్తూనే అదిరిపోయే మైలేజీని అందిస్తుంది. దాదాపు 300 లీటర్ల బూట్ స్పేస్‌తో వచ్చే ఈ కారు, రాజసం, సౌకర్యం కలగలిసిన ప్యాకేజీ.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
