UPI Autopay: యూపీఐలో విప్లవాత్మక మార్పులు.. ఆటోపేపై కస్టమర్లకే కంప్లీట్ కంట్రోల్.

UPI Autopay: యూపీఐ ద్వారా మనీ పేమెంట్స్ చేసే కస్టమర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ ఆటోపే సిస్టమ్‌లో కీలకమైన మార్పును తీసుకొచ్చింది. ఇప్పుడు వినియోగదారులు తమకు సంబంధించిన అన్ని యాక్టివ్ ఆటోపే పేమెంట్స్ ను ఏ యూపీఐ యాప్‌లోనైనా చూసేందుకు వీలు కలుగుతుంది. దీని ద్వారా డబ్బులు తమకు తెలియకుండా కట్ కావడం వంటి సమస్యలకు పూర్తిగా చెక్ పడుతుంది. ఈ మార్పుల వల్ల యూపీఐ చెల్లింపుల యాప్‌లపై వినియోగదారులకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది.
ఎన్‌పీసీఐ ఒక కొత్త విధానాన్ని విడుదల చేసింది. దీని ప్రకారం, వినియోగదారులు తమ పేరు మీద కొనసాగుతున్న అన్ని యూపీఐ ఆటోపే మాండేట్‌లను (ఉదాహరణకు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, మొబైల్ బిల్లు లేదా ఈఎంఐ వంటివి) ఏ యూపీఐ యాప్ నుంచైనా చూసుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు. ఉదాహరణకు, మీ కొన్ని ఆటోపే చెల్లింపులు గూగుల్ పేలో, మరికొన్ని ఫోన్‌పేలో ఉన్నా... వాటిని మీరు ఏ యాప్‌లోనైనా ఒకేసారి చూసుకోవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు తమ మాండేట్‌లను ఒక యాప్ నుంచి మరొక యాప్‌లోకి పోర్ట్ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది.
ఈ మార్పుతో వినియోగదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తమకు తెలియకుండా యూపీఐ ద్వారా ఏయే రెగ్యులర్ పేమెంట్స్ ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయో వారికి తెలుస్తుంది. దీనివల్ల తమ డబ్బును మెరుగ్గా ప్లాన్ చేసుకోవడం, బడ్జెట్ మేనేజ్‌మెంట్ సులభమవుతుంది. ఈ కొత్త సిస్టమ్ అమలు చేయడానికి అన్ని బ్యాంకులు, యూపీఐ యాప్‌లకు ఎన్‌పీసీఐ డిసెంబర్ 31, 2025 వరకు గడువు ఇచ్చింది. మర్చెంట్లు కూడా తమకు నచ్చిన పేమెంట్ సర్వీసు ద్వారా ఆటోపే మాండేట్‌లను నిర్వహించుకోవచ్చు.
ఎన్‌పీసీఐ అన్ని బ్యాంకులు, యూపీఐ యాప్‌లకు తమ యాప్‌లలో బ్యాంక్ ఖాతాలను నిర్వహించండి లేదా యూపీఐ ఆటోపే అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇక్కడ వినియోగదారులు తమ ఆటోపే మాండేట్‌లను చూసుకోవచ్చు. అవసరమైతే వేరే యాప్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. అయితే, ఈ బదిలీ ప్రక్రియ పూర్తిగా వినియోగదారుడి ఇష్టానుసారం జరగాలి. బదిలీ కోసం ఏ యాప్ కూడా వినియోగదారులను క్యాష్‌బ్యాక్, ఆఫర్లు లేదా నోటిఫికేషన్లు ఇచ్చి ఆకర్షించకూడదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.
ఎన్‌పీసీఐ మరొక కీలకమైన సెక్యూరిటీ ఫీచర్ కూడా ప్రకటించింది. ఇప్పుడు యూపీఐ పిన్ సెట్ చేయడానికి లేదా తిరిగి సెట్ చేయడానికి ఫేస్ ఐడీ, బయోమెట్రిక్ గుర్తింపు సౌకర్యం లభిస్తుంది. ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రస్తుతానికి రూ.5,000 వరకు చేసే ట్రాన్సాక్షన్లకే వర్తిస్తుంది. భవిష్యత్తులో ఈ పరిమితిని పెంచే అవకాశం ఉంది. మొత్తంమీద, ఈ మార్పులు యూపీఐ వినియోగదారులకు మరింత పారదర్శకత, భద్రత, సౌకర్యాన్ని తీసుకురాబోతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com