Bitcoin Crash : క్రిప్టో ప్రపంచంలో మహా ప్రళయం..పాతాళానికి పడిపోతున్న బిట్ కాయిన్ ధర.

Bitcoin Crash : క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న బిట్‌కాయిన్ ఇన్వెస్టర్లకు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బిట్‌కాయిన్ విలువ భారీగా పడిపోతూ ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు లక్ష డాలర్ల మార్కును దాటిన ఈ డిజిటల్ కరెన్సీ, ఇప్పుడు 69,000 డాలర్ల వద్దకు పడిపోయింది. అయితే ఈ పతనం ఇక్కడితో ఆగేలా లేదని, రాబోయే రోజుల్లో ఇది మరింత ఘోరంగా పడిపోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ స్టిఫెల్ వెల్లడించిన నివేదిక క్రిప్టో ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రస్తుతం 69,000 డాలర్ల వద్ద ఉన్న బిట్‌కాయిన్, భవిష్యత్తులో 38,000 డాలర్ల వరకు పడిపోయే అవకాశం ఉందని ఆ సంస్థ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ కరెన్సీ 1,26,000 డాలర్ల వద్ద ట్రేడ్ అవ్వగా, కేవలం కొద్ది నెలల్లోనే దాదాపు సగానికి సగం విలువ కోల్పోయింది. నవంబర్ 2024 తర్వాత బిట్‌కాయిన్ ఇంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.
బిట్‌కాయిన్ చరిత్రను గమనిస్తే ఇలాంటి భారీ పతనాలు కొత్తేమీ కాదు. 2011లో బిట్‌కాయిన్ ఏకంగా 93 శాతం పడిపోయింది. ఆ తర్వాత 2015లో 84 శాతం, 2018లో 83 శాతం, 2022లో 76 శాతం మేర కుప్పకూలింది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఇది ఇప్పటికే తన గరిష్ట స్థాయి నుంచి 41 శాతం పడిపోయింది. పాత గణాంకాలను బట్టి చూస్తే బిట్‌కాయిన్ తర్వాతి స్టేషన్ 38,000 డాలర్లే అని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు.
గతంలో డాలర్ విలువ తగ్గితే బిట్‌కాయిన్ పెరిగేది. కానీ 2025 నుంచి బిట్‌కాయిన్ తన స్వభావాన్ని మార్చుకుంది. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ బలహీనంగా ఉన్నప్పటికీ బిట్‌కాయిన్ కూడా పడిపోతోంది. అంతేకాకుండా దీనికి ఇప్పుడు షేర్ మార్కెట్ తో బంధం పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠినంగా వ్యవహరిస్తే చాలు, బిట్‌కాయిన్ నేలచూపులు చూస్తోంది. టెక్ కంపెనీలపై పెరుగుతున్న అప్పుల భారం, స్టాక్ మార్కెట్ ఒత్తిడి బిట్‌కాయిన్‌ను మరింత కిందకు లాగే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
