Budget 2026 : ప్రపంచం ఆశ్చర్యపోయేలా భారత ఈవీ విప్లవం..బడ్జెట్ లో కాసుల వర్షం.

Budget 2026 : ప్రపంచం ఆశ్చర్యపోయేలా భారత ఈవీ విప్లవం..బడ్జెట్ లో కాసుల వర్షం.
X

Budget 2026 : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026లో కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు పెట్రోల్, డీజిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా భారీ కేటాయింపులు చేసింది. ముఖ్యంగా భారత్ లోనే ఈవీల తయారీని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ పథకాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ నిర్ణయాల వల్ల రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లు, టూ-వీలర్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

పీఎల్ఐ బడ్జెట్ భారీగా పెంపు ఆటోమొబైల్ రంగంలో స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి బడ్జెట్ ను ఏకంగా 111 శాతం పెంచింది. అంటే, గతంలో కంటే రెట్టింపు నిధులు అంటే దాదాపు రూ.5,939 కోట్లను ఈ రంగానికి కేటాయించింది. దీనివల్ల కంపెనీలు మన దేశంలోనే విడిభాగాలను తయారు చేసి, తక్కువ ధరకే వాహనాలను విక్రయించే అవకాశం ఉంటుంది. అయితే, లిథియం-అయాన్ సెల్ తయారీకి సంబంధించి పీఎల్ఐ బడ్జెట్ ను 45 శాతం తగ్గించడం గమనార్హం. రిలయన్స్, ఓలా వంటి సంస్థలు తమ గిగాఫ్యాక్టరీలను పూర్తి చేయడంలో జాప్యం చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది.

నాలుగు ప్రత్యేక కారిడార్లు ఈవీ తయారీలో అత్యంత కీలకమైనవి రేర్ ఎర్త్ మినరల్స్. ప్రస్తుతం వీటి కోసం భారత్ ఎక్కువగా ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నాలుగు ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్ జరిగితే విదేశీ దిగుమతుల భారం తగ్గి, బ్యాటరీల ధరలు గణనీయంగా తగ్గుతాయి.

ప్రస్తుతం మన దేశం లిథియం-అయాన్ సెల్స్ కోసం దాదాపు 75 శాతం చైనాపైనే ఆధారపడుతోంది. చైనా తన ఎగుమతులపై ఇస్తున్న పన్ను రాయితీలను తొలగించాలని భావిస్తోంది, దీనివల్ల భవిష్యత్తులో బ్యాటరీ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన భారత ప్రభుత్వం, లిథియం-అయాన్ సెల్స్ తయారీకి అవసరమైన యంత్రాల దిగుమతిపై జీరో కస్టమ్స్ డ్యూటీని పొడిగించింది. అలాగే, సెల్స్ దిగుమతిపై 5 శాతం రాయితీని కొనసాగిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, మన దేశంలో ఈవీల ధరలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.

బ్యాటరీ రంగంలో దేశీయ దిగ్గజాల పోటీ ఎలక్ట్రిక్ వాహనం మొత్తం ధరలో బ్యాటరీ ఖర్చే 30 నుంచి 40 శాతం వరకు ఉంటుంది. అందుకే బ్యాటరీలను ఇక్కడే తయారు చేయడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే కొంత మేర దేశీయంగా సెల్స్ తయారు చేస్తోంది. కానీ 2030 నాటికి జేఎస్‌డబ్ల్యూ, రిలయన్స్, టాటా అగ్రాటాస్, ఎక్సైడ్, అమర రాజా వంటి సంస్థలు భారీ గిగాఫ్యాక్టరీలను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, పెట్రోల్ వాహనాల కంటే ఈవీలే చౌకగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

మౌలిక సదుపాయాల కల్పన కేవలం వాహనాలు ఉంటే సరిపోదు, వాటిని ఛార్జ్ చేసే సదుపాయాలు కూడా ఉండాలి. బడ్జెట్ లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు, హైటెక్ టూల్ రూమ్స్ కు ప్రభుత్వం పెద్దపీట వేసింది. కంటైనర్ తయారీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఈవీల ఎగుమతులను కూడా సులభతరం చేయాలని చూస్తోంది. సింపుల్ ఎనర్జీ సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ వంటి నిపుణులు ఈ బడ్జెట్ నిర్ణయాలను స్వాగతిస్తూ, ఇది భారత్ ను గ్లోబల్ ఈవీ హబ్ గా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Next Story