Central Govt Revenue : బడ్జెట్ తర్వాత ఖజానాకు పంట..ఆర్‌బీఐ, బ్యాంకుల నుంచి రూ.3.16 లక్షల కోట్లు.

Central Govt Revenue : బడ్జెట్ ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి భారీ జాక్‌పాట్ తగిలింది. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వ ఖజానాకు కనకవర్షం కురవనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3.16 లక్షల కోట్ల ఆదాయం డివిడెండ్ల రూపంలో అందుతుందని అంచనా వేస్తున్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 3.75 శాతం ఎక్కువ. ఖజానా నిండుతుండటంతో ఆర్థిక లోటును తగ్గించుకునేందుకు ప్రభుత్వానికి ఇది పెద్ద ఊరటగా మారింది.
ప్రభుత్వానికి కేవలం మనం కట్టే పన్నుల నుంచే కాకుండా, నాన్-టాక్స్ రెవెన్యూ ద్వారా కూడా భారీగా ఆదాయం వస్తుంది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే డివిడెండ్ అత్యంత కీలకమైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్‌బీఐ, ఇతర జాతీయ బ్యాంకుల నుంచి దాదాపు రూ.3.16 లక్షల కోట్లు వస్తాయని పార్లమెంట్‌లో సమర్పించిన సవరించిన అంచనాలు చెబుతున్నాయి. గత ఏడాది ఇది రూ.3.05 లక్షల కోట్లుగా ఉంది. అంటే సుమారు రూ.11 వేల కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరబోతోంది. దీనితో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మరో రూ. 75 వేల కోట్లు డివిడెండ్ల రూపంలో రానున్నాయి.
నిజానికి గత ఎనిమిదేళ్లలో ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి బదిలీ అయ్యే డివిడెండ్ భారీగా పెరిగింది. 2022లో కేవలం రూ. 30,307 కోట్లు ఉన్న ఈ ఆదాయం, 2025 నాటికి రూ.2.68 లక్షల కోట్లకు చేరిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆర్‌బీఐ విదేశీ కరెన్సీ ఆస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీలపై చేసే పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాలే ఈ భారీ ఆదాయానికి ప్రధాన కారణం. ఈ డబ్బు రావడం వల్ల ప్రభుత్వంపై అదనపు అప్పులు చేయాల్సిన అవసరం లేదా పన్నులు పెంచాల్సిన ఒత్తిడి తగ్గుతుంది.
ఈ ఆదాయం ప్రాముఖ్యత ఏమిటంటే.. ఇది దేశ ఆర్థిక లోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం తన ఖర్చుల కోసం చేసే అప్పులను తగ్గించుకోవడానికి ఈ డివిడెండ్లు సహాయపడతాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన , సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూసేందుకు ఈ రూ.3.16 లక్షల కోట్లు సంజీవనిలా పనిచేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆర్‌బీఐ తన పెట్టుబడుల ద్వారా సంపాదించిన లాభం ఇప్పుడు సామాన్యుల అభివృద్ధికి ఉపయోగపడబోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
