Jawa Yezdi : కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో జావా యెజ్డీ బైక్ మీ సొంతం.

Jawa Yezdi : కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో జావా యెజ్డీ బైక్ మీ సొంతం.
X

Jawa Yezdi : జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ సంస్థ తమ అమ్మకాల పరిధిని పెంచుకోవడానికి డిజిటల్ మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే అక్టోబర్ 2024లో ఫ్లిప్‌కార్ట్‌లో బుకింగ్స్ ప్రారంభించిన ఈ సంస్థ, ఇప్పుడు తమ మొత్తం మోడల్ లైనప్‌ను అమెజాన్ ఇండియాలో కూడా అందుబాటులోకి తెచ్చింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త నిర్ణయం ద్వారా దాదాపు 40కి పైగా నగరాల్లో అందుబాటులో ఉండాలని, త్వరలో 100కు పైగా నగరాలకు తమ సేవలను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

అమెజాన్ ఇండియాలో బైక్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం, జావా యెజ్డీకి చెందిన అన్ని ప్రముఖ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో జావా 350, జావా 42, జావా 42 ఎఫ్‌జే, జావా 42 బాబర్, జావా పెరాక్ తో పాటు యెజ్డీ అడ్వెంచర్, యెజ్డీ స్క్రాంబ్లర్ వంటి మోడల్స్ ఉన్నాయి. కస్టమర్‌లు ఈ ఆన్‌లైన్ వేదికల్లో ప్రతి మోడల్ పూర్తి వివరాలు, టెక్నికల్ అంశాలు, వేరియంట్లను చూసి, అక్కడే తమ బుకింగ్‌ను పూర్తి చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో బైక్ బుక్ చేసే కస్టమర్‌ల కోసం జావా యెజ్డీ అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇందులో ఈఎంఐ ప్లాన్స్, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు ఉన్నాయి. అమెజాన్ ద్వారా కొనుగోలు చేసే ప్రైమ్ కస్టమర్‌లకు, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే, 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం, అలాగే 5 శాతం క్యాష్‌బ్యాక్ (రూ.4,000 వరకు) అందుబాటులో ఉంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా మోటార్‌సైకిల్ ఫైనాన్స్, బీమా సౌకర్యాలు కూడా లభిస్తున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30కి పైగా నగరాలలోని 40 డీలర్‌షిప్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉన్నాయి. రాబోయే వారాల్లో మరిన్ని డీలర్‌షిప్‌లను ఆన్‌లైన్ వేదికల్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి అనేక రాష్ట్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ 2.0 కారణంగా జావా యెజ్డీ బైక్స్ ధరలు భారీగా తగ్గాయి. ఈ బైక్‌లపై ఇప్పుడు కేవలం 18 శాతం పన్ను మాత్రమే వర్తిస్తుంది. జావా యెజ్డీ మొత్తం మోడల్ లైనప్ 350 సీసీ కంటే తక్కువ కెపాసిటీ గల ఇంజిన్లతో ఉంటుంది. కంపెనీ తాజాగా అప్‌డేట్ చేసిన యెజ్డీ రోడ్‌స్టర్‌ మోడల్ ధరను కూడా ఏకంగా రూ. 16,500 వరకు తగ్గించింది.

Tags

Next Story