Campa Cola : కోక్-పెప్సీ గుండెల్లో రైళ్లు..రూ.60 వేల కోట్ల మార్కెట్‌లో అంబానీ సంచలనం.

Campa Cola : కోక్-పెప్సీ గుండెల్లో రైళ్లు..రూ.60 వేల కోట్ల మార్కెట్‌లో అంబానీ సంచలనం.
X

Campa Cola : ముఖేష్ అంబానీ పాత క్యాంపా కోలా కంపెనీని కొనుగోలు చేసినప్పటి నుంచే దేశంలోని రూ.60,000 కోట్ల సాఫ్ట్‌డ్రింక్ మార్కెట్‌లో పెప్సీ, కోకా-కోలాకు గట్టి పోటీ తప్పదని అంతా ఊహించారు. ఇప్పుడు బయటికి వచ్చిన గణాంకాలు ఆ అంచనాలను నిజం చేశాయి. అంబానీకి చెందిన క్యాంపా, లాహౌరి జీరా వంటి కొత్త, చిన్న కంపెనీలు కలిసి జనవరి-సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో తమ మార్కెట్ వాటాను దాదాపు రెండింతలు పెంచుకున్నాయి.

నీల్సన్ఐక్యూ డేటా ప్రకారం జనవరి-సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో ఈ కొత్త కంపెనీల మొత్తం మార్కెట్ వాటా దాదాపు 7% నుంచి 15%కి పెరిగింది. ఫలితంగా కోకా-కోలా, పెప్సికో వంటి దిగ్గజాల సంయుక్త మార్కెట్ వాటా ఇదే కాలంలో 93% నుంచి 85%కి పడిపోయింది. అంటే, 8% వాటాను కొత్త బ్రాండ్లు లాగేసుకున్నాయి. ఈ మార్పు ఎక్కువగా రూ.10 ధర పాయింట్‌లలో కనిపించడం విశేషం.

2022లో క్యాంపా కోలాను కొనుగోలు చేసి, 2023లో మళ్లీ మార్కెట్‌లోకి తెచ్చిన రిలయన్స్ దూకుడుగా ముందుకు వెళ్తోంది. క్యాంపా బ్రాండ్‌ను పాపులర్ చేయడానికి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేక చర్యలు చేపట్టింది: ఈ ఏడాది ఐపీఎల్ కోసం కో-పవర్డ్ బై స్పాన్సర్‌షిప్ తీసుకోవడం.నటుడు రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం. హైదరాబాద్ మెట్రోతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మెట్రో క్యాంపస్‌లలో క్యాంపా డ్రింక్స్ అమ్మే హక్కులు పొందడం ద్వారా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

రెండు దేశీయ బ్రాండ్లలో ఒకటైన లాహౌరి జీరా కూడా మార్కెట్‌లో తన వాటాను రెట్టింపు చేసుకుంది. లాహౌరి జీరా కో-ఫౌండర్ అయిన నిఖిల్ డోడా మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 80-90% పిన్ కోడ్‌లను కవర్ చేస్తూ తమ ఉనికిని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

క్యాంపా, లాహౌరి వంటి బ్రాండ్ల నుంచి వచ్చిన తీవ్ర పోటీ కారణంగా కోకా-కోలా (కోక్, థమ్స్ అప్, స్ప్రైట్), పెప్సికో (పెప్సీ, గేటోరేడ్) వంటి కంపెనీలు కూడా కొత్త ప్యాక్‌లను తీసుకురావాల్సి వచ్చింది. గతంలో రూ.12 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్యాక్‌లను ఇప్పుడు కేవలం రూ. 10 ధరకే తీసుకురావడానికి ఈ పోటీ కారణమైంది. అమెరికా వెలుపల పెప్సికోకు అతిపెద్ద భాగస్వామి అయిన వరుణ్ బెవరేజెస్ చైర్మన్ రవి జైపురియా కూడా మార్కెట్‌లో పోటీ పెరిగిందని అంగీకరించారు. అయితే ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన మార్పు అని అభిప్రాయపడ్డారు.

Tags

Next Story