Car Loan : ఈఎంఐ టెన్షన్ ఇక లేదు..కారు రుణాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా అదిరిపోయే డిస్కౌంట్.

Car Loan : ఈఎంఐ టెన్షన్ ఇక లేదు..కారు రుణాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా అదిరిపోయే డిస్కౌంట్.
X

Car Loan : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కారు రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మీరు ప్రతి నెలా చెల్లించే ఈఎంఐ భారం గణనీయంగా తగ్గనుంది. సొంత కారు అనే మధ్యతరగతి కలని సాకారం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా సోమవారం తన కారు రుణాల వడ్డీ రేట్లను 0.30 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఆర్బీఐ రెపో రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, గతంలో జరిగిన రెపో రేట్ల తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలని బ్యాంక్ నిర్ణయించింది. తాజా తగ్గింపుతో ఫ్లోటింగ్ వడ్డీ రేటు వార్షికంగా 7.6 శాతం నుంచి ప్రారంభం కానుంది. ఇక ఫిక్స్‌డ్ వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. అయితే, ఈ 7.6 శాతం వడ్డీ రేటు అనేది కస్టమర్ సిబిల్ స్కోరు, క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది.

కేవలం వడ్డీ రేట్లు తగ్గించడమే కాకుండా, కస్టమర్లకు మరిన్ని ఊరటనిచ్చే నిర్ణయాలను బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకుంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ పై కారు లోన్ తీసుకునే వ్యక్తులకు ప్రీ-పేమెంట్ లేదా పాక్షిక చెల్లింపులపై ఎటువంటి అదనపు ఛార్జీలు విధించబోమని బ్యాంక్ తెలిపింది. అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లోన్ మొత్తాన్ని ముందుగానే కట్టేస్తే ఎలాంటి జరిమానా ఉండదు. అలాగే, వడ్డీని డైలీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతిలో లెక్కిస్తారు. దీనివల్ల అసలు తగ్గే కొద్దీ వడ్డీ భారం కూడా ప్రతిరోజూ తగ్గుతూ వస్తుంది. ఇది కస్టమర్లకు చాలా లాభదాయకమైన విషయం.

కారు లోన్ తిరిగి చెల్లించే విషయంలో కూడా బ్యాంక్ వెసులుబాటు కల్పించింది. కస్టమర్లు తమ లోన్ ను గరిష్టంగా 84 నెలల (7 ఏళ్ల) కాలపరిమితిలో చెల్లించవచ్చు. దీనివల్ల ప్రతి నెలా కట్టాల్సిన ఈఎంఐ భారం తగ్గుతుంది. అంతేకాకుండా, టెక్నాలజీని వాడుకుంటూ కస్టమర్లు బాబ్ వరల్డ్ యాప్ ద్వారా లేదా డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నిమిషాల వ్యవధిలోనే లోన్ అప్రూవల్ పొందేలా ఏర్పాట్లు చేసింది. నేరుగా బ్యాంకుకు వెళ్లలేని వారు ఆన్‌లైన్‌లోనే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.

గత ఏడాది 2025లో ఆర్బీఐ రెపో రేట్లను ఏకంగా 125 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఆ ప్రయోజనాన్ని ఇప్పుడు కస్టమర్లకు బదిలీ చేసిన అతికొద్ది బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి. ఫిబ్రవరి 6న జరిగిన మానిటరీ పాలసీ మీటింగ్‌లో ఆర్బీఐ రేట్లను మార్చనప్పటికీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ముందస్తుగానే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ప్రైవేట్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే ఆలోచనలో ఉండగా, ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇలా రేట్లను తగ్గించడం కారు అమ్మకాలను పెంచే అవకాశం ఉంది.

Tags

Next Story