New Rules 2026 : కారు మైలేజీ ఇక పక్కా..ఏసీ ఆన్ చేసి టెస్ట్ చేయాల్సిందే..అక్టోబర్ 2026 నుంచి కొత్త రూల్స్.

New Rules 2026 : కారు మైలేజీ ఇక పక్కా..ఏసీ ఆన్ చేసి టెస్ట్ చేయాల్సిందే..అక్టోబర్ 2026 నుంచి కొత్త రూల్స్.
X

New Rules 2026 : కారు కొనేటప్పుడు మనం అడిగే మొదటి ప్రశ్న మైలేజీ ఎంత ఇస్తుంది? అని. షోరూమ్‌లో కంపెనీ వారు ఒక లెక్క చెబితే, తీరా రోడ్డు మీదకు వచ్చాక కారు ఇచ్చే మైలేజీ దానికి అస్సలు సంబంధం ఉండదు. ఈ తేడా వల్ల వాహనదారులు చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇకపై అటువంటి మోసాలకు తావుండదు. కారు కంపెనీలు చెప్పే మైలేజీకి, నిజంగా వచ్చే మైలేజీకి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అక్టోబర్ 1, 2026 నుంచి కార్ల మైలేజీ టెస్టింగ్ నిబంధనల్లో పెను మార్పులు రాబోతున్నాయి.

ఏసీ ఆన్ చేస్తేనే అసలు మైలేజీ

ప్రస్తుతం భారతదేశంలో కార్ల మైలేజీని ఎలా టెస్ట్ చేస్తున్నారో తెలుసా? కారులో ఏసీని పూర్తిగా ఆపివేసి, ఒక నియంత్రిత వాతావరణంలో టెస్ట్ చేస్తారు. దీనివల్ల మైలేజీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మన దేశ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 90 శాతం మంది కారులో ఏసీని నిరంతరం వాడుతూనే ఉంటారు. ఏసీ ఆన్ చేసినప్పుడు ఇంజిన్‌పై లోడ్ పెరిగి మైలేజీ తగ్గుతుంది. అందుకే కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ AIS-213 అనే కొత్త స్టాండర్డ్స్‌ను ప్రతిపాదించింది. ఈ కొత్త రూల్ ప్రకారం, కంపెనీలు మైలేజీని టెస్ట్ చేసేటప్పుడు కచ్చితంగా ఏసీ ఆన్ చేసి పరీక్షించాలి. అప్పుడు వచ్చే రీడింగ్‌నే అధికారికంగా ప్రకటించాలి.

అక్టోబర్ 1, 2026 నుంచి అమలు

ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1, 2026 నుంచి దేశంలో తయారయ్యే లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని కార్లకు వర్తిస్తాయి. దీనివల్ల కస్టమర్లకు కారు కొనేముందే అది వాస్తవ పరిస్థితుల్లో ఎంత మైలేజీ ఇస్తుందో స్పష్టమైన అవగాహన వస్తుంది. యూరోపియన్ టెస్టింగ్ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు ఏసీ ఆపివేసి టెస్ట్ చేసేవారు, కానీ భారతీయ వాతావరణం, ట్రాఫిక్ పరిస్థితులు యూరప్‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే మన దేశానికి తగ్గట్టుగా ఈ మార్పులు అవసరమని ప్రభుత్వం భావించింది.

ప్రజల అభిప్రాయం కోరుతున్న ప్రభుత్వం

ఈ నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిపై సామాన్య ప్రజలు, వాహన తయారీ సంస్థలు తమ అభిప్రాయాలను, సూచనలను లేదా అభ్యంతరాలను తెలియజేయడానికి 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువు ముగిసిన తర్వాత నిబంధనలను ఖరారు చేసి అధికారికంగా అమలు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కారు కంపెనీలు తమ ఇంజిన్ల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడుతుంది.

వాహనదారులకు కలిగే లాభాలేంటి?

ఈ కొత్త విధానం వల్ల వాహనదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, కంపెనీలు చెప్పే తప్పుడు మైలేజీ అంకెలను నమ్మి మోసపోయే అవకాశం ఉండదు. రెండోది, ఇంధన ఖర్చుల విషయంలో సామాన్యులకు ముందే ఒక క్లారిటీ ఉంటుంది. మూడోది, కంపెనీలు తమ కార్ల మైలేజీని మెరుగుపరచడానికి హైబ్రిడ్ లేదా మరింత సమర్థవంతమైన టెక్నాలజీని తీసుకురావాల్సి ఉంటుంది. మొత్తానికి, కారు కొనుగోలుదారుడికి రాజ్యాధికారం కట్టబెడుతూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Tags

Next Story