Car Prices : పెరగనున్న వాహనాల ధరలు..కొత్త ఏడాదిలో కారు కొనాలంటే జేబుకు చిల్లు పడ్డట్టే.

Car Prices : కొత్త సంవత్సరం 2026 ప్రారంభంతోనే భారతీయ కారు కొనుగోలుదారులకు కొంత షాక్ తగలనుంది. జనవరి 1వ తేదీ నుంచి కార్లు, బైకులు, ఇతర వాహనాలను కొనుగోలు చేయడానికి గతంలో కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు ముడిసరుకు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం. ఈ అదనపు భారాన్ని వాహన తయారీ కంపెనీలు ఇప్పుడు కస్టమర్లపైకి నెట్టడానికి సిద్ధమవుతున్నాయి. కాపర్, అల్యూమినియం, పల్లాడియం, రోడియం వంటి విలువైన లోహాల ధరలు విపరీతంగా పెరగడంతో, అనేక కార్ల కంపెనీలు జనవరి నుంచి ధరలను 3 శాతం వరకు పెంచే అవకాశం ఉంది.
ఈ ధరల పెంపునకు ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ముడిసరుకు ధరల పెరుగుదల. నవంబర్ వరకు గడిచిన ఎనిమిది నెలల్లో ప్లాటినం సగటు ధర 36 శాతం, పల్లాడియం ధర 19 శాతం పెరిగాయి. అలాగే, కాపర్ ధర 6 శాతం, అల్యూమినియం ధర 3 శాతం పెరిగాయి. రెండోది రూపాయి బలహీనత. ఈ విలువైన లోహాలు చాలా వరకు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి ఖర్చు మరింత పెరిగింది. పరిశ్రమ గతంలో ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించినప్పుడు డాలర్‌తో రూపాయి విలువ 88 వద్ద ఉండగా, ఇప్పుడు అది దాదాపు 90 కి చేరింది.
సాధారణంగా కంపెనీలు కొత్త సంవత్సరం ప్రారంభంలో ధరలను పెంచుతాయి. బలమైన బుకింగ్‌లు, రాబోయే నెలల్లో మంచి డిమాండ్ ఉంటుందనే అంచనా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో ఉన్న తీవ్ర పోటీ కారణంగా ధరల పెంపు స్వల్పంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు ధరల పెంపును అధికారికంగా ప్రకటించాయి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా జనవరి 1 నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా జనవరి 1 నుంచి తమ మోటార్‌సైకిళ్ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ ఇండియా కూడా జనవరి 1 నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది.
కార్లు మాత్రమే కాదు, ద్విచక్ర వాహనాలు కూడా ప్రియం కానున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారుచేసే కంపెనీ ఏథర్ ఎనర్జీ కూడా వచ్చే నెల నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను రూ.3,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడిసరుకు ధరలు పెరగడం, విదేశీ కరెన్సీలో మార్పులు, ఎలక్ట్రానిక్ విడిభాగాల ధరలు పెరగడం ఈ పెంపునకు కారణాలుగా ఏథర్ తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు కూడా ధరలు పెంచుతాయని భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

