IndiGo : వందల కోట్లు దోచేస్తున్నారా? ఇండిగోపై ఉచ్చు బిగిస్తున్న కేంద్రం..విచారణకు ఆదేశం.

IndiGo : భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోపై భారత పోటీతత్వ కమిషన్ (CCI) సీరియస్ అయ్యింది. గత డిసెంబర్ నెలలో వేల సంఖ్యలో విమానాలను రద్దు చేయడం ద్వారా మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించిందని సీసీఐ ప్రాథమికంగా నిర్ధారించింది. విమాన ప్రయాణానికి భారీ డిమాండ్ ఉన్న సమయంలో ఇలా విమానాలను రద్దు చేయడం అంటే.. పోటీతత్వ చట్టంలోని సెక్షన్ 4(2)(బి)(ఐ) ప్రకారం తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడమేనని కమిషన్ అభిప్రాయపడింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని తన డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది.
డిసెంబర్‌లో ఏం జరిగింది?
డిసెంబర్ మొదటి వారంలో ఇండిగో యాజమాన్యం తీవ్రమైన నిర్వహణ లోపాలను ఎదుర్కొంది. కేవలం డిసెంబర్ 3 నుంచి 5వ తేదీల మధ్యే ఏకంగా 2,507 విమానాలు రద్దు అయ్యాయి. మరో 1,852 విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో నరకం చూశారు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, సేవలను నిలిపివేయడం ద్వారా విమాన టికెట్ల ధరలు పెరిగేలా ఇండిగో ప్రవర్తించిందని ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే భారీ జరిమానా.. ఇప్పుడు విచారణ సెగ
నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ జనవరి 17న పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) ఇండిగోకు రూ.22.20 కోట్ల భారీ జరిమానా విధించింది. అంతేకాకుండా, ఎయిర్‌లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా హెచ్చరించింది. వ్యవస్థలో దీర్ఘకాలిక మార్పులు తీసుకురావాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ₹50 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాలని కూడా ఆదేశించింది. ఇప్పుడు సీసీఐ విచారణ కూడా తోడవడంతో ఇండిగో మరిన్ని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
విచారణలో తేలితే భారీ మూల్యం
ఒక కంపెనీ మార్కెట్‌లో తనకున్న ఆధిపత్యాన్ని అడ్డం పెట్టుకుని వినియోగదారులను ఇబ్బంది పెట్టడం చట్టరీత్యా నేరం. విచారణలో ఇండిగో ఉద్దేశపూర్వకంగానే విమానాలను రద్దు చేసిందని తేలితే, కంపెనీ వార్షిక టర్నోవర్‌లో నిర్ణీత శాతం జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. ఇది కోట్లలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండిగో తన శీతాకాల విమాన షెడ్యూల్‌లో కూడా 10 శాతం కోతను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాలు భారత విమానయాన రంగంలో ఇతర కంపెనీలకు కూడా ఒక హెచ్చరికలా మారాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
