Cigarette Stocks : స్టాక్ మార్కెట్లో సిగరెట్ సునామీ..తాగేవాడు ఉన్నంత కాలం.. ఈ కంపెనీలకు తిరుగులేదు.

Cigarette Stocks : సిగరెట్ కంపెనీల స్టాక్స్ స్టాక్ మార్కెట్లో మళ్లీ పొగలు కక్కుతున్నాయి. ఏడాది ఆరంభంలో పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ వాతలతో కుదేలైన సిగరెట్ షేర్లు.. ఇప్పుడు ఫినిక్స్ పక్షిలా పుంజుకుంటున్నాయి. ఫిబ్రవరి నెలలో ఈ కంపెనీల షేర్లు ఏకంగా 25 శాతం వరకు ఎగబాకడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వం విధించిన భారీ పన్నుల భారాన్ని కంపెనీలు తెలివిగా కస్టమర్ల మీదకు నెట్టేయడమే ఈ జోరుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2026 నుంచి సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచింది. గతంలో 1,000 స్టిక్స్‌పై రూ.2,050 ఉన్న డ్యూటీని ఏకంగా రూ. 8,500లకు పెంచేశారు. అంతేకాకుండా పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. ఈ వార్తలతో జనవరిలో సిగరెట్ షేర్లు కుప్పకూలాయి. అయితే, కంపెనీలు తమ లాభాలను కాపాడుకోవడానికి సిగరెట్ ధరలను 20 నుంచి 40 శాతం వరకు పెంచేయడంతో సీన్ మారిపోయింది. ఐటీసీ షేరు జనవరిలో 20 శాతం పడిపోయినప్పటికీ, ఫిబ్రవరిలో లో లెవల్స్ నుంచి 7 శాతం రికవరీ అయింది. ఇక గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఏకంగా 25 శాతం, వీఎస్టీ ఇండస్ట్రీస్ 5 శాతం మేర లాభపడ్డాయి.
ధరలు భారీగా పెరిగినా డిమాండ్ తగ్గకపోవడం ఈ కంపెనీలకు కలిసొచ్చే అంశం. ఉదాహరణకు.. ఐటీసీకి చెందిన 84 ఎంఎం ప్రీమియం సిగరెట్ ధర ఒకప్పుడు రూ.17 ఉంటే, ఇప్పుడు అది రూ.24కు చేరింది. ధర పెరిగినప్పటికీ అలవాటున్న వారు సిగరెట్లు మానుకోరని, కాబట్టి కంపెనీల ఆదాయానికి ఢోకా ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల కంపెనీలు తమ 30 నుంచి 40 శాతం మార్జిన్లను సులభంగా కాపాడుకోగలవు. పన్నుల భారం మొత్తం పొగ తాగే వారి జేబులకే చిల్లు పెడుతోంది తప్ప, కంపెనీల లాభాలకు ఏమాత్రం అడ్డుపడటం లేదు.
ప్రస్తుతం ఈ షేర్ల వాల్యుయేషన్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. బలమైన బ్రాండ్ విలువ, భారీగా చేతిలో ఉండే నగదు, ధరలను ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకోగల సామర్థ్యం ఈ కంపెనీల సొంతం. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు, డివిడెండ్ ద్వారా ఆదాయం కోరుకునే వారికి ఇవి మంచి ఆప్షన్లు అని నిపుణులు చెబుతున్నారు. అయితే అక్రమ సిగరెట్ల అమ్మకాలు పెరగడం లేదా ప్రభుత్వ నిబంధనల్లో మరిన్ని మార్పులు రావడం వంటి రిస్కులు కూడా ఉన్నాయని, వాటిపై కన్నేసి ఉంచాలని హెచ్చరిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
