Citroen Aircross : సేఫ్టీలో దుమ్మురేపిన సిట్రోయెన్ ఎయిర్ క్రాస్.. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్

Citroen Aircross : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సేఫ్టీకి ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ కారు సంచలనం సృష్టించింది. తాజాగా నిర్వహించిన భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో ఈ కారు అద్భుతంగా రాణించి, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ హై సేఫ్టీ రేటింగ్ ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. ఇది కొనుగోలుదారులకు మరింత భరోసా ఇస్తుంది.
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడంలో అద్భుతమైన స్కోర్లను నమోదు చేసింది. అడల్ట్ ప్యాసింజర్ సేఫ్టీలో 32 పాయింట్లకు గాను 27.05 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు గాను 40 పాయింట్లు సాధించింది. ముందు నుంచి ఢీకొనే టెస్ట్‌లో డ్రైవర్, ముందు ప్రయాణీకులకు మంచి సేఫ్టీని అందించింది. ముఖ్యంగా, సైడ్ నుంచి ఢీకొనే టెస్ట్‌లో ఎయిర్‌క్రాస్ 16 పాయింట్లకు గాను పూర్తి 16 పాయింట్లు సాధించింది. డైనమిక్ టెస్ట్, చైల్డ్ రెస్ట్రయింట్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ టెస్ట్‌లో కూడా ఈ కారు పూర్తి పాయింట్లు దక్కించుకుంది.
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ బలం దాని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లలో ఉంది. సేఫ్టీ విషయంలో కంపెనీ రాజీ పడకుండా, అన్ని వేరియంట్లలో కింది కీలక ఫీచర్లను అందిస్తోంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ , టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లను అందిస్తోంది. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ.8.32 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎస్‌యూవీలో కేవలం ఒకే ఒక 1199సీసీ పెట్రోల్ ఇంజిన్ ఎంపిక ఉంది. ట్రాన్స్‌మిషన్ పరంగా, మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు లీటరుకు 18 కిమీ వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ ధృవీకరించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com