Citroen : సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు, కొత్త రేట్లు ఇవే.

Citroen : ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ తన పాపులర్ ఎస్‌యూవీ ఎయిర్‌క్రాస్ ప్రియులకు షాకిచ్చింది. భారత మార్కెట్లో ఈ కారు ధరలను పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం.. వేరియంట్‌ను బట్టి ఈ కారు ధర గరిష్టంగా రూ.42 వేల వరకు పెరిగింది. గతంలో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, ఇప్పుడు అది రూ.8.89 లక్షలకు చేరుకుంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ ధర దాదాపు రూ.14.56 లక్షల మార్కును తాకింది. అయితే కేవలం ధర పెంచడమే కాకుండా, కారును మరింత ప్రీమియం లుక్‌లోకి మారుస్తూ కొన్ని కొత్త ఫీచర్లను కూడా జత చేసింది.
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ వేరియంట్లలో ధరల మార్పులు పరిశీలిస్తే.. 1.2 లీటర్ నార్మల్ పెట్రోల్ యూ 5-సీటర్ మోడల్ ధర రూ.40 వేలు పెరిగి రూ.8.89 లక్షలకు చేరింది. అదేవిధంగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్లలో ప్లస్ 7-సీటర్ ధర ఏకంగా రూ.42 వేలు పెరిగి రూ.11.99 లక్షలకు చేరుకుంది. ఇక ఆటోమేటిక్ వేరియంట్లలో 5-సీటర్, 7-సీటర్, 7-సీటర్ డ్యూయల్ టోన్ మోడళ్లపై రూ.42,500 వరకు అదనపు భారం పడనుంది. ఈ మార్పులు మార్చి 2026 నుంచే అమలులోకి వచ్చాయని కంపెనీ స్పష్టం చేసింది.
ధర పెరిగినా కూడా కారు లోపల ఇచ్చే సౌకర్యాలను సిట్రోయెన్ మరింత మెరుగుపరిచింది. కొత్త ఎయిర్‌క్రాస్ ఎక్స్ కేబిన్‌లో లెదర్ డాష్‌బోర్డ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, డ్యూయల్ టోన్ థీమ్ ఉపయోగించారు. దీనివల్ల కారు లోపల లగ్జరీ ఫీల్ కలుగుతుంది. వీటితో పాటు పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, వైట్ యాంబియంట్ లైటింగ్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం వంటి ఫీచర్లు యాడ్ అయ్యాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే.. ఇందులో CARA అనే ఇన్-కార్ ఏఐ అసిస్టెంట్ ఉంది. ఇది ఏకంగా 52 భాషల్లో వాయిస్ కమాండ్లను అర్థం చేసుకోగలదు, ఇది డ్రైవర్లకు నావిగేషన్, ఇతర సమాచారాన్ని అందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
ధరలు పెరిగినా ఇంజిన్ విషయంలో మాత్రం కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఎయిర్‌క్రాస్ ఇప్పటికీ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. ఒకటి 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (81 bhp పవర్), దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. రెండోది మరింత పవర్‌ఫుల్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (108 bhp పవర్), దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సిటీ రోడ్లపై, హైవేలపై ఈ కారు పర్ఫార్మెన్స్ చాలా స్మూత్‌గా ఉంటుందని కస్టమర్ల టాక్.
సేఫ్టీ విషయంలో సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ రాజీ పడలేదు. క్రాష్ టెస్టుల్లో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి హేమాహేమీలతో పోటీపడుతోంది. 360-డిగ్రీల కెమెరా ఆప్షన్ ఉండటం వల్ల పార్కింగ్ చేయడం కూడా ఇప్పుడు చాలా సులభమైంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
