Credit Score : ఒకే జీతం.. కానీ ఒకరికి తక్కువ వడ్డీ, మరొకరికి ఎక్కువ..బ్యాంకులు ఎందుకిలా చేస్తున్నాయి?

Credit Score : మీ జీతం నెలకు లక్షల్లో ఉండవచ్చు.. మీరు పెద్ద కంపెనీలో పని చేస్తూ ఉండవచ్చు.. కానీ, అప్పు ఇచ్చేటప్పుడు బ్యాంకులకు మీ జీతం కంటే మీ క్యారెక్టర్(క్రెడిట్ బిహేవియర్) ముఖ్యం. ఒకే జీతం, ఒకే వయసు ఉన్న ఇద్దరు వ్యక్తులకు బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లకు లోన్లు ఇస్తున్నాయి. దీనికి కారణం మీ క్రెడిట్ స్కోర్. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే లక్షల రూపాయల వడ్డీ ఆదా అవుతుంది, లేదంటే బ్యాంకులు మీ ముక్కు పిండి మరీ ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే.. తమ జీతం బాగుంటే బ్యాంకులు తక్కువ వడ్డీకే లోన్ ఇస్తాయని. కానీ ఇది పాత కాలపు మాట. ఇప్పుడు బ్యాంకులు మీ ఆదాయం కంటే మీ ఆర్థిక క్రమశిక్షణను ఎక్కువగా నమ్ముతున్నాయి. ఉదాహరణకు రోహిత్, కుల్దీప్ అనే ఇద్దరు వ్యక్తుల కథ చూద్దాం. వీరిద్దరికీ 35 ఏళ్లు, ఇద్దరూ ఏడాదికి రూ.16 లక్షలు సంపాదిస్తున్నారు. ఇద్దరూ ఒకే బ్యాంకులో రూ.50 లక్షల హోమ్ లోన్ కోసం అప్లై చేశారు. కానీ రోహిత్‌కు 8.5% వడ్డీకి లోన్ రాగా, కుల్దీప్‌కు మాత్రం 9.8% వడ్డీ పడింది. అంటే కుల్దీప్ తన లోన్ కాలం మొత్తం మీద రోహిత్ కంటే ఏకంగా రూ.10 లక్షలు అదనంగా వడ్డీ కట్టాలి.
దీనికి కారణం ఏమిటంటే.. రోహిత్ తన క్రెడిట్ కార్డు బిల్లులను, పాత కార్ లోన్ ఈఎంఐలను ఎప్పుడూ ఆలస్యం చేయకుండా కట్టేవాడు. కానీ కుల్దీప్ మాత్రం గతంలో రెండు మూడు సార్లు పేమెంట్లు లేటుగా చేశాడు. అంతేకాకుండా తన క్రెడిట్ కార్డు లిమిట్‌ను ఎప్పుడూ పూర్తిగా వాడేస్తూ అప్పుల్లో ఉండేవాడు. ఈ చిన్న పొరపాట్లే కుల్దీప్‌ను బ్యాంకు దృష్టిలో రిస్క్ ఉన్న కస్టమర్‌గా మార్చాయి. అందుకే అతనికి ఎక్కువ వడ్డీ రేటు విధించబడింది. మీ జీతం మీరు ఎంత సంపాదించగలరో చెబుతుంది, కానీ మీ క్రెడిట్ స్కోర్ మీరు ఆ డబ్బును ఎంత బాధ్యతగా వాడుతున్నారో చెబుతుంది.
కేవలం అప్పులు కట్టడమే కాదు, పదే పదే ఉద్యోగాలు మారడం కూడా మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను దెబ్బతీస్తుంది. రోహిత్ గత 9 ఏళ్లుగా ఒకే ఐటీ కంపెనీలో పని చేస్తుండగా, జర్నలిస్ట్ అయిన కుల్దీప్ 10 ఏళ్లలో 4 సార్లు సంస్థలు మారాడు. ఒకే చోట ఎక్కువ కాలం పనిచేసే వారికి బ్యాంకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. ఎందుకంటే వారి ఆదాయం స్థిరంగా ఉంటుందని బ్యాంకులు భావిస్తాయి. నేడు బ్యాంకులు అల్గారిథమ్స్ ద్వారా లోన్లు ఇస్తున్నాయి. మీ గతం (రీ పేమెంట్ హిస్టరీ) బాలేకపోతే మీ వర్తమానం (లోన్ అప్రూవల్) కష్టమవుతుంది.
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీ రేట్లు మాత్రమే కాదు, ఎక్కువ లోన్ లిమిట్, వేగవంతమైన అప్రూవల్స్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి. లోన్ కావాలి అనుకున్నప్పుడు కాకుండా, క్రెడిట్‌ను ఒక దీర్ఘకాలిక ఆస్తిలా భావించి ఇప్పటి నుండే జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో కట్టడం, అనవసరంగా ఎక్కువ లోన్ల కోసం అప్లై చేయకపోవడం, మీ క్రెడిట్ లిమిట్‌లో కేవలం 30% మాత్రమే వాడటం వంటివి చేస్తే మీ స్కోర్ పెరుగుతుంది. ఒక్క శాతం వడ్డీ తేడా వచ్చినా, అది మీ జీవితకాల సంపాదనలో లక్షల రూపాయలను హరించివేస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
