Credit Score : ఎక్కువ సంపాదన ఉంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉంటుందా?

Credit Score : ఎక్కువ సంపాదన ఉంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉంటుందా?
X

Credit Score : మంచి క్రెడిట్ స్కోరు అనేది కేవలం ఎక్కువ సంపాదన మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని చాలా మందికి సందేహం ఉంటుంది. వాస్తవానికి ఎక్కువ ఆదాయం ఉంటే అప్పు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.. కానీ ఆ ఆదాయం ఒక్కటే మెరుగైన క్రెడిట్ స్కోరును నిర్ధారించదు. క్రెడిట్ స్కోరు అనేది డబ్బును ఎంత సంపాదిస్తున్నారు అనేదాని కంటే, ఎంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎలా నిర్ణయమవుతుంది? ఆదాయం ఉన్నా స్కోరు ఎందుకు తగ్గుతుంది? అనే వివరాలు చూద్దాం.

మీ క్రెడిట్ స్కోరును నిర్ణయించడంలో మీ ఆదాయం ప్రధాన పాత్ర పోషించదు. స్కోరు పూర్తిగా మీ అప్పుల నిర్వహణ తీరు మీద ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోరు ప్రధానంగా పేమెంట్స్ హిస్టరీ, అవుట్ స్టాండింగ్ అమౌంట్, క్రెడిట్ హిస్టరీ కాలం, కొత్తగా తీసుకున్న అప్పులు, క్రెడిట్ రకాలు వంటి అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది.

ఎక్కువ సంపాదించే వ్యక్తి అప్పులు తీసుకోవడానికి అర్హత పెరుగుతుంది. ఈ సామర్థ్యం మెరుగ్గా ఉంటే, అది పరోక్షంగా క్రెడిట్ స్కోరును మెరుగుపరుస్తుంది. కానీ, ఇది తప్పనిసరి కాదు. ఎంత ఎక్కువ సంపాదించినా, క్రెడిట్ నిర్వహణలో క్రమశిక్షణ లేకపోతే, స్కోరు కచ్చితంగా తగ్గుతుంది.

ఎక్కువ సంపాదించే వ్యక్తి కూడా అప్పులను సమయానికి తిరిగి చెల్లించడంలో విఫలమైతే, క్రెడిట్ కార్డు పరిమితిని పూర్తిగా ఉపయోగిస్తే, లేదా పాత మంచి క్రెడిట్ ఖాతాలను మూసివేస్తే, అతని క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. దీనికి విరుద్ధంగా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి కూడా తన చెల్లింపులలో క్రమశిక్షణ పాటిస్తూ, క్రెడిట్‌ను సరిగ్గా నిర్వహిస్తే, అతను మెరుగైన క్రెడిట్ స్కోరును కొనసాగించవచ్చు.

క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలంటే, అప్పులు తీసుకునేటప్పుడు, దాన్ని నిర్వహించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయానికి అనుగుణంగానే అప్పు తీసుకోవాలి. ఉదాహరణకు, ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తికి అధిక క్రెడిట్ పరిమితి లభించినప్పటికీ, ఆ మొత్తం పరిమితిలో 30% కంటే ఎక్కువ ఎప్పుడూ ఉపయోగించకూడదు. తక్కువ క్రెడిట్‌ను తీసుకోవడం వల్ల, దానిని తిరిగి చెల్లించడం సులభమవుతుంది. చాలా మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని అంచనా వేసుకుని కొత్త అప్పులు తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ఆర్థిక అలవాటు. ప్రజెంట్ కెపాసిటీ మేరకు మాత్రమే అప్పు తీసుకోవడం తెలివైన నిర్ణయం.

Tags

Next Story