Hyundai : ప్రతి రోజు 600కార్లు అమ్ముతున్న హ్యుందాయ్.. బ్రాండ్ అంబాసిడర్గా మరోసారి ఆ మోడల్.

Hyundai : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సెప్టెంబర్ నెలలో మరోసారి తన సత్తా చాటింది. అమ్మకాలలో 10 శాతం వృద్ధి నమోదు చేయడమే కాకుండా, వారి అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ క్రెటా మరోసారి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది. సెప్టెంబర్‌లో ప్రతిరోజూ 600 మందికి పైగా కస్టమర్లు క్రెటాను కొనుగోలు చేశారు. ఇటీవల అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 కారణంగా క్రెటా, వెన్యూ ఎస్‌యూవీల ధరలు గణనీయంగా తగ్గడం అమ్మకాల జోరుకు మరింత దోహదపడింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సెప్టెంబర్ 2025 నెలలో అద్భుతమైన అమ్మకాల సంఖ్యను నమోదు చేసింది. సెప్టెంబర్‌లో కంపెనీ మొత్తం 70,347 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది (సెప్టెంబర్ 2024లో 64,201 యూనిట్లు)తో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి. దేశీయ మార్కెట్‌లో 51,547 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో ఎస్‌యూవీ మోడళ్ల వాటానే అత్యధికంగా ఉంది, ఇది కంపెనీ చరిత్రలోనే రికార్డు స్థాయి.
2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు కూడా గత ఏడాదితో పోలిస్తే 17% పెరిగి 99,540 యూనిట్లకు చేరాయి. అయితే, బలమైన అమ్మకాలు ఉన్నప్పటికీ, మొత్తం భారతీయ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ (59,667 యూనిట్లు), మహీంద్రా అండ్ మహీంద్రా (56,714 యూనిట్లు) కంటే వెనుకబడి హ్యుందాయ్ నాల్గవ స్థానానికి పడిపోయింది.
సెప్టెంబర్ నెల అమ్మకాలలో హ్యుందాయ్ ఎస్‌యూవీ మోడళ్లు అసాధారణమైన పనితీరును కనబరిచాయి. సెప్టెంబర్‌లో క్రెటా మొత్తం 18,861 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. అంటే, సెప్టెంబర్ నెలలో ప్రతిరోజు 628 మందికి పైగా కస్టమర్లు క్రెటాను కొనుగోలు చేశారు. వెన్యూ ఎస్‌యూవీ అమ్మకాలు కూడా పెరిగాయి. గత 20 నెలల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 11,484 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 కారణంగా, క్రెటా, వెన్యూ ఎస్‌యూవీల ధరలు భారీగా తగ్గాయి, ఇది కూడా అమ్మకాలు పెరగడానికి ఒక ముఖ్య కారణం. క్రెటా ధరలో రూ.72,145 వరకు తగ్గింపు లభించింది. వెన్యూ ధరలో ఏకంగా రూ.1.23 లక్షల వరకు తగ్గింపు లభించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com