Debt : అప్పు మంచిదా, చెడ్డదా? సామాన్య ప్రజలు ధనవంతులుగా మారడానికి సీక్రెట్స్ ఇవే.

Debt : అప్పు మంచిదా, చెడ్డదా? సామాన్య ప్రజలు ధనవంతులుగా మారడానికి సీక్రెట్స్ ఇవే.
X

Debt : అప్పు చేసి అయినా పప్పు కూడు తినాలి అని పెద్దలు చెబుతారు. అదే సమయంలో అప్పుల ఊబిలో చిక్కుకోకు అని కూడా హెచ్చరిస్తారు. నిజానికి, అప్పు లేకుండా జీవితం గడపడం కష్టం. కొందరు అప్పుల కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడితే మరికొందరు అదే అప్పును తెలివిగా ఉపయోగించి ధనవంతులుగా మారారు. ఇదంతా మనం తీసుకునే అప్పు ఎలాంటిది, దేనికోసం తీసుకుంటున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మంచి అప్పు, చెడు అప్పు మధ్య తేడా ఏంటి? ఏ అప్పు సంపదను పెంచుతుంది, ఏ అప్పు ప్రమాదకరం? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

వ్యక్తి ఆర్థిక పరిస్థితిని నిర్ణయించడంలో అప్పు చాలా కీలకంగా మారుతుంది. ఏది మంచి అప్పు, ఏది చెడ్డ అప్పు అనేది తెలుసుకోవడం ద్వారానే ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. అనవసరమైన లేదా కాలక్రమేణా విలువ తగ్గే వస్తువులను కొనుగోలు చేయడానికి తీసుకునే అప్పులను చెడు అప్పులు అంటారు. ఇవి వ్యక్తికి ఆర్థిక భారాన్ని మాత్రమే పెంచుతాయి. భవిష్యత్తులో విలువ పెరిగే, లేదా ఆదాయాన్ని సంపాదించి పెట్టే ఆస్తులను పొందడానికి తీసుకునే అప్పులను మంచి అప్పులుగా పరిగణిస్తారు. ఇవి దీర్ఘకాలంలో సంపదను పెంచడానికి సహాయపడతాయి.

చెడు అప్పులు ప్రధానంగా వినియోగదారుల ఖర్చులకు సంబంధించినవి. వీటిని నివారించడం లేదా పరిమితం చేయడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డులను అనవసరమైన వస్తువులు కొనడానికి, అధిక వడ్డీకి వాడుకుంటే అది అప్పుల ఊబిగా మారుతుంది. ఇది ఒక ట్రాప్ అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తారు. లక్షల విలువైన లగ్జరీ వస్తువులు, లేక అవసరం లేకున్నా పెద్ద కార్ల కోసం తీసుకునే రుణాలు చెడ్డ అప్పులు. ముఖ్యంగా వాహనాలు రోజులు గడిచే కొద్దీ తమ విలువను కోల్పోతాయి. ప్రైవేట్ ఫైనాన్షియర్‌ల నుంచి రోజుకు 10% - 30% అధిక వడ్డీకి తీసుకునే రుణాలు అతిపెద్ద ఆర్థిక కష్టాలకు దారితీస్తాయి.

మంచి అప్పులు తరచుగా పెట్టుబడులకు లేదా భవిష్యత్ ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఇంటి రుణంపై వడ్డీ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా, మీరు కొనుగోలు చేసిన ఆస్తి కాలక్రమేణా విలువ పెరుగుతుంది. అంతేకాక పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. వ్యాపారం లేదా పరిశ్రమను స్థాపించడానికి తీసుకునే అప్పులు మంచి అప్పులు. ఎందుకంటే, ఈ పెట్టుబడి భవిష్యత్తులో మంచి రాబడిని సంపాదించి పెడుతుంది. విద్య అనేది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన పెట్టుబడి. విద్య కోసం తీసుకునే అప్పు, మీ జ్ఞానం, కెరీర్ అవకాశాలను మెరుగుపరుస్తుంది కాబట్టి, ఇది కూడా మంచి అప్పుగా పరిగణిస్తారు.

అప్పు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు కాకుండా వ్యవహారికంగా ఆలోచించడం ముఖ్యం. అప్పుపై మీరు చెల్లించే వడ్డీ ఎంత, ఆ అప్పుతో మీరు కొనుగోలు చేసిన ఆస్తి మీకు ఎంతవరకు ప్రయోజనకరం అవుతుంది అనే అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. హౌసింగ్ లోన్ మంచి అప్పు అయినప్పటికీ దానికి చెల్లించే నెలవారీ ఈఎంఐ మీ మొత్తం నెలవారీ ఆదాయంలో 30% మించకుండా చూసుకోవడం ఉత్తమం. ఈ వ్యూహాత్మక విధానం మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుంది.

Tags

Next Story