Gold-Silver Sales : ధరలు ఆకాశాన్నంటుతున్నా తగ్గేదేలే.. ధనతేరస్‌కు రికార్డుల మోత మోగిస్తున్న బంగారం వ్యాపారం.

Gold-Silver Sales : బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయినా ఈసారి ధనతేరస్ పండుగకు ఈ రెండింటి కొనుగోళ్లు భారీగా జరగనున్నాయి. దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లలో కొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఒక్క రోజునే సుమారు రూ.50,000 కోట్ల వ్యాపారం జరగవచ్చని అంచనా. ఈ అంచనాను మరెవరో కాదు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్, దాని జ్యువెలరీ విభాగం ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ సంయుక్తంగా విడుదల చేశాయి. ధనతేరస్ రోజున బంగారం, వెండి, పాత్రలు, వంట సామాగ్రి మొదలైనవి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
క్యాట్, ఏఐజేజీఎఫ్ దేశవ్యాప్తంగా ఉన్న బులియన్ మార్కెట్లలో నిర్వహించిన ధనతేరస్ సర్వే ప్రకారం.. ఈ సంవత్సరం ధనతేరస్ నాడు బంగారం, వెండి నాణేల అమ్మకాల్లో భారీ పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, బంగారు ఆభరణాల అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ధనతేరస్‌కు బంగారం, వెండి వ్యాపారం రూ.50,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేవలం ఢిల్లీలోనే ఈ వ్యాపారం రూ.8,000-రూ.10,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.
క్యాట్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేవాల్, ఏఐజేజీఎఫ్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా మాట్లాడుతూ.. బంగారం, వెండి రికార్డు స్థాయిలో పెరిగిన ధరల కారణంగా మధ్య, ఉన్నత తరగతి కస్టమర్‌లు పెట్టుబడి రూపంలో నాణేలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అదే సమయంలో ఆభరణాల డిమాండ్‌లో కొంత తగ్గుదల నమోదవుతోంది. పెళ్లిళ్ల సీజన్ కొనుగోలుదారులు కూడా ఇప్పుడు భారీ ఆభరణాల స్థానంలో తేలికపాటి నగలకు మొగ్గు చూపుతున్నారు.
గత సంవత్సరం దీపావళి సమయంలో బంగారం ధర దాదాపు రూ.80,000 ప్రతి 10 గ్రాములకు ఉండగా, ఈ సంవత్సరం అది రూ.1,30,000 ప్రతి 10 గ్రాములను దాటింది. అంటే సుమారు 60 శాతం పెరుగుదల కనిపించింది. అదేవిధంగా, వెండి ధరలు 2024లో కిలోకు రూ.98,000 ఉండగా, ఇప్పుడు అవి రూ.1,80,000లకు చేరింది. అంటే సుమారు 55 శాతం పెరుగుదల నమోదైంది. ఈ పెరిగిన ధరల కారణంగా, చాలా మంది పెట్టుబడిదారులు బులియన్ మార్కెట్ వైపు ఆకర్షితులయ్యారు. ధనతేరస్ నుండి దీపావళి వరకు పండుగల సీజన్‌లో బులియన్, నాణేలకు అత్యధిక డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల చిన్న, పెద్ద జ్యువెలర్లు పనిచేస్తున్నారు. ప్రతి జ్యువెలర్ సగటున 50 గ్రాముల బంగారం విక్రయిస్తే, మొత్తం సుమారు 25 టన్నుల బంగారం అమ్ముడవుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం దీని విలువ సుమారు రూ.32,500 కోట్లు అవుతుంది. అదేవిధంగా, ప్రతి జ్యువెలర్ సగటున 2 కిలోల వెండి విక్రయిస్తే, సుమారు 1,000 టన్నుల వెండి అమ్ముడవుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం దీని విలువ సుమారు రూ.18,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ విధంగా, దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లలో మొత్తం రూ.50,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. మారుతున్న మార్కెట్ ట్రెండ్‌లకు అనుగుణంగా, జ్యువెలర్లు ఇప్పుడు ఫ్యాన్సీ జ్యువెలరీ, వెండి నాణేల వంటి కొత్త ఆప్షన్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com