Car Discount : కారు కొనేవారికి డబుల్ బొనాంజా.. జీఎస్‌టీ + దీపావళి డిస్కౌంట్స్..రేట్లు చాలా చౌక.

Car Discount : భారతదేశంలో పండుగల సీజన్ అంటే కేవలం దీపాల వెలుగులు, మిఠాయిలకు మాత్రమే కాదు, కొత్త కొనుగోళ్లకు, కొత్త ప్రారంభాలకు కూడా ప్రతీక. ముఖ్యంగా, ప్రతేడాది దీపావళి సమయంలో కారు కంపెనీలు తమ వినియోగదారులను ఆకర్షించడానికి అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తాయి. అయితే, ఈసారి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ఇటీవల ప్రభుత్వం కార్లపై జీఎస్‌టీ రేట్లను తగ్గించింది. దీని వల్ల వాహనాల ధరలు ఇప్పటికే తగ్గాయి. రాబోయే దీపావళికి వినియోగదారులకు కార్లు మరింత చవకగా మారున్నాయని తెలుస్తోంది.
భారత ప్రభుత్వం ఇటీవల 350 సీసీ వరకు ఉన్న టూ వీలర్లు, ఫోర్ వీలర్ల పై జీఎస్‌టీ తగ్గింపును ప్రకటించింది. కొత్త రేట్ల ప్రకారం.. పెట్రోల్-డీజిల్ (ICE) కార్లపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీని ప్రభావం కారు ధరలపై నేరుగా పడింది. ఇప్పటికే చాలా కంపెనీలు తమ కార్ల ధరలను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు తగ్గించాయి. ఈ ఉపశమనం ఇప్పటికే వినియోగదారులకు లభించింది, దీంతో కొత్త కారు కొనుగోలు మరింత చవకైంది.
అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఉండే పండుగల సమయం ఆటోమొబైల్ సంస్థలకు అతిపెద్ద అమ్మకాల కాలం. దీపావళి సందర్భంగా దాదాపు అన్ని కంపెనీలు మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, హోండా, టయోటా -- ప్రత్యేక ఆఫర్లు, పండుగ బోనస్‌లను ప్రకటిస్తాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే తమ ఆఫర్లను ప్రారంభించాయి కూడా.
ఉదాహరణకు, టాటా మోటార్స్ తమ హారియర్ 2024 మోడల్‌పై రూ.50 వేల తగ్గింపుతో పాటు, రూ.25 వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఇస్తోంది. అలాగే, హోండా కార్స్ ఇండియా దీపావళి 2025 సెలబ్రేషన్ ఆఫర్‌ను ప్రకటించింది. మీడియం రేంజ్ ఎస్‌యూవీ ఎలివేట్పై అత్యధిక ఆఫర్ లభిస్తోంది. టాప్-స్పెక్ మోడల్ పై వినియోగదారులు రూ.1.32 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్, లాయల్టీ, కార్పొరేట్ పథకాలు ఉన్నాయి.
మార్కెట్ డిమాండ్ విషయానికొస్తే, ఈసారి ముఖ్యంగా ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్ వాహనాల విభాగాలలో కొనుగోలుదారుల ఆసక్తి అద్భుతంగా ఉంది. మార్కెట్ నివేదికల ప్రకారం.. దసరా, ధనత్రయోదశి పండుగలకు ముందే అనేక డీలర్‌షిప్‌లలో కారు బుకింగ్‌లు 20-25% వరకు పెరిగాయి. ఆటో నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వినియోగదారులు డబుల్ బెనిఫిట్ (జీఎస్‌టీ తగ్గింపు + పండుగ డిస్కౌంట్) ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చూస్తుండటంతో, రాబోయే రెండు నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com