Diwali Crackers : ఆకాశాన్నంటిన టపాసుల ధరలు.. 40శాతం పెరిగిన ధరలు..!

Diwali Crackers  : ఆకాశాన్నంటిన టపాసుల ధరలు.. 40శాతం పెరిగిన ధరలు..!
Diwali Crackers : దీపావళి పండుగ వేళ టపాసుల రేట్లు ఆకాశాన్నంటాయి. ఏది ముట్టుకున్నా పేలిపోయే రేట్లున్నాయి. గతేడాదితో పోలిస్తే 30 నుంచి 40శాతం రేట్లు పెరిగాయి.

దీపావళి పండుగ వేళ టపాసుల రేట్లు ఆకాశాన్నంటాయి. ఏది ముట్టుకున్నా పేలిపోయే రేట్లున్నాయి. గతేడాదితో పోలిస్తే 30 నుంచి 40శాతం రేట్లు పెరిగాయి. చిన్న కాకరవత్తుల బాక్సు పోయినసారి 100 రూపాయలకు వస్తే.... ఈసారి అది 140కి పెరిగింది. దీంతో టపాసులు కొనాలంటే ఆలోచిస్తున్నారు సామాన్యులు. ధరలు పెరిగినప్పటికీ... పిల్లల కోసం తప్పదు కాబట్టి కొన్నయినా తీసుకుంటున్నారు. బాణసంచాపై రేట్లు పెరగడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా కరోనా, లాక్ డౌన్... బాణసంచా పరిశ్రమను కుదిపేశాయి. మహమ్మారి కారణంగా టపాసుల అమ్మకాలు రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో లేవు. డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తిని కూడా ఆపేశారు తయారీదారులు. టపాసుల తయారీకి ప్రసిద్ధి గాంచిన తమిళనాడులోని శివకాశిలో ఈఏడాది 40శాతమే ఉత్పత్తి జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

చమురు ధరల పెంపు... రా మెటిరీయల్ రేట్లు పెరగడం కూడా టపాసుల ధర ఇంతలా పెరగడానికి కారణమని చెప్తున్నారు వ్యాపారులు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగాయంటున్నారు. గతేడాది ఒక్కో లారీ లోడ్ ట్రాన్స్ పోర్ట్ ఛార్జీ 15వేలైతే.. ఈసారి 22వేలకు పైనే చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. రా మెటిరీయల్ పైనా 32శాతం ధరలు పెరిగాయి. ఇలా పలు కారణాలతో బాణసంచా పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. వాస్తవానికి గతేడాదితో పోలిస్తే టపాసుల సేల్స్ ఈసారి 25శాతం పెరిగాయి. కానీ కంపెనీలు రేట్లు పెంచడంతో తమకూ పెద్దగా లాభాలు వచ్చే పరిస్థితి లేదంటున్నారు వ్యాపారులు.

కరోనా కారణంగా రెండేళ్లుగా ఎవరూ పండుగను అంతలా జరుపుకోలేదు. ఈసారి వైరస్ ప్రభావం తగ్గడంతో జనాల్లో మళ్లీ పాత జోష్ కనిపించింది. ఈసారి దీపావళిని ఘనంగా జరుపుకుందామనుకున్నారు. కానీ రేట్లు ఇంతలా పెరగడం వినియోగదారులకు షాకిచ్చింది. రేట్లు ఎంతున్నా..... ఇంట్లో పిల్లలు గొడవకైనా టపాసులు కొనాల్సిన పరిస్థితి. దీంతో గతంలో 4వేల రూపాయల టపాసులు కొన్నవాళ్లు.. ఈసారి 2వేలతో సరిపెట్టుకుంటున్నారు. కరోనా, చమురు, రా మెటిరీయల్ ధరల పెంపు... అటు వ్యాపారులతో పాటు... ఇటు వినియోగదారులపైనా తీవ్ర ప్రభావం చూపింది.

Tags

Read MoreRead Less
Next Story