Economic Survey 2026: ప్రభుత్వం పాస్ అయ్యిందా? ఫెయిల్ అయ్యిందా? ఆర్థిక సర్వేతో తేలిపోనున్న అసలు గుట్టు.

Economic Survey 2026: దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి కళ్లు బడ్జెట్ 2026 పైనే ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి సామాన్యుడికి ఎలాంటి వరాలు ఇస్తారు? ఆదాయపు పన్నులో ఊరట లభిస్తుందా? ధరలు తగ్గుతాయా? అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే, బడ్జెట్ అనే అసలు సినిమా కంటే 24 గంటల ముందే ప్రభుత్వం తన రిజల్ట్‌ను దేశం ముందు ఉంచుతుంది. దాన్నే ఆర్థిక సర్వే అంటారు. బడ్జెట్ రేపటి ఆశ అయితే, ఆర్థిక సర్వే నిన్నటి వాస్తవం. ప్రభుత్వం గత ఏడాది కాలంలో ఏం సాధించింది, ఎక్కడ విఫలమైందనేది ఈ రిపోర్ట్ కార్డులో స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను పార్లమెంటులో ఉంచుతుంది. ఇది కేవలం ఒక డాక్యుమెంట్ మాత్రమే కాదు, స్కూల్ రిపోర్ట్ కార్డులో విద్యార్థి ప్రగతి ఎలా ఉంటుందో, ఆర్థిక సర్వేలో దేశ ప్రగతి కూడా అలాగే ఉంటుంది. గత బడ్జెట్‌లో ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఎంతవరకు అమలయ్యాయి? ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో సాధించిన పురోగతి ఏమిటి? అనే విషయాలను ఇది గణాంకాలతో సహా వివరిస్తుంది. బడ్జెట్ అంటే భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పే ప్లాన్ అయితే, ఆర్థిక సర్వే అంటే గతంలో ఏం చేశారో చెప్పే రిజల్ట్.
ఈ కీలకమైన నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందిస్తుంది. దీనికి ప్రధాన ఆర్థిక సలహాదారు నాయకత్వం వహిస్తారు. ప్రస్తుతం వి.అనంత్ నాగేశ్వరన్ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోని ఆర్థిక నిపుణుల బృందం గత 12 నెలల కాలంలో దేశంలోని వివిధ రంగాల గణాంకాలను లోతుగా విశ్లేషించి ఈ నివేదికను సిద్ధం చేస్తుంది. ఆర్థిక మంత్రి ఆమోదం పొందిన తర్వాత, దీనిని పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచుతారు. దేశ ఆర్థిక దిశను అర్థం చేసుకోవడానికి పెట్టుబడిదారులు, ఆర్థికవేత్తలు, సామాన్యులకు ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.
సామాన్య ప్రజలకు ఈ నివేదిక ఎందుకు ముఖ్యమంటే.. మన దేశం అభివృద్ధి పథంలో ఉందా లేదా మాంద్యం వైపు వెళ్తుందా అనేది దీని ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలన వంటి సామాజిక అంశాలపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, దానివల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏమిటి అనేది ఈ నివేదికలో విడమర్చి చెబుతారు. ఒకవేళ ఆర్థిక సర్వేలో దేశ ఆర్థిక పరిస్థితి బలంగా ఉందని తేలితే, బడ్జెట్‌లో పన్ను తగ్గింపులు లేదా కొత్త సంక్షేమ పథకాలు వచ్చే అవకాశం ఉంటుంది. పరిస్థితి ఆశాజనకంగా లేకపోతే, ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది.
ఈ ఏడాది ఆర్థిక సర్వేను జనవరి 29న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సంప్రదాయం ప్రకారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ఉభయ సభలకు సమర్పిస్తారు. అనంతరం ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత్ నాగేశ్వరన్ విలేకరుల సమావేశం నిర్వహించి దేశ ఆర్థిక స్థితిగతులపై పూర్తి వివరాలను వెల్లడిస్తారు. వచ్చే ఏడాది భారత జిడిపి అభివృద్ధి రేటు ఎలా ఉండబోతోంది, ప్రపంచ ఆర్థిక సవాళ్లను భారత్ ఎలా ఎదుర్కోబోతోంది అనే అంశాలపై ఆయన క్లారిటీ ఇస్తారు. బడ్జెట్ 2026 పై అంచనాలు పెంచుకునే ముందు, జనవరి 29న వెల్లడయ్యే ఈ రిపోర్ట్ కార్డు వైపే దేశం మొత్తం చూస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
