Anil Ambani : అనిల్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ..రూ.54 కోట్లు జప్తు, 13 బ్యాంకు ఖాతాలు సీజ్.

Anil Ambani : అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీ చర్యలు తీసుకుంది. విదేశీ మారక నిర్వహణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా కంపెనీకి చెందిన 13 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం వెల్లడించింది. దేశంలో రహదారులు, హైవేల నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ నిధులను అక్రమంగా దారి మళ్లించారని ఈడీ ఆరోపించింది.
ఈడీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తన దర్యాప్తులో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖాతాలలో ఉన్న భారీ మొత్తంలో డబ్బు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఏజెన్సీ, కంపెనీకి చెందిన 13 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. ఆ ఖాతాల్లో మొత్తం రూ.54.82 కోట్లు జమ అయినట్లు ఈడీ తెలిపింది. ఫెమా, 1999లోని సెక్షన్ 37ఏ కింద ఈ చర్య తీసుకోవడం జరిగింది. హైవే ప్రాజెక్టుల నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా విడుదల చేసిన డబ్బును ఆయా ప్రాజెక్టులకు కాకుండా, ఇతర అవసరాలకు ఉపయోగించడం సెక్షన్ 4 ఉల్లంఘనకు ప్రత్యక్షంగా సంబంధించిన అంశమని ఈడీ పేర్కొంది.
ఈడీ ఆరోపణల ప్రకారం రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ద్వారా ఎన్‌హెచ్‌ఏఐ నుంచి అందిన నిధులను దారి మళ్లించింది. ఈ నిధులను నేరుగా కాకుండా చట్టవిరుద్ధంగా తరలించినట్లు దర్యాప్తులో తేలింది. ముంబైకి చెందిన కొన్ని షెల్ కంపెనీలతో (కేవలం కాగితాలపై మాత్రమే ఉండే సంస్థలు) సబ్-కాంట్రాక్టింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంపెనీ చూపించింది. ఈ ఒప్పందాలు నకిలీవి లేదా తప్పుడువి అని ఈడీ ఆరోపించింది. ఈ సబ్-కాంట్రాక్టుల మాటున ప్రభుత్వ నిధులను ముందుగా ఈ షెల్ కంపెనీలకు పంపి, ఆ తర్వాత అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
ఈ దర్యాప్తు కేవలం కంపెనీకే పరిమితం కాలేదు. దీని ముడి అగ్ర నాయకత్వం వరకు చేరింది. ఈ కేసులో విచారణ కోసం ఈడీ గత నెలలోనే అనిల్ అంబానీకి సమన్లు పంపింది. అయితే ఆయన తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడానికి ఏజెన్సీ ముందు హాజరు కాలేదు. ప్రస్తుతం రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ జప్తు, ఈడీ ఆరోపణలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదా వివరణ ఇవ్వలేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

