Anil Ambani : అనిల్ అంబానీకి ఈడీ షాక్..రూ.1,885 కోట్ల ఆస్తులు జప్తు.

Anil Ambani : అనిల్ అంబానీకి ఈడీ షాక్..రూ.1,885 కోట్ల ఆస్తులు జప్తు.
X

Anil Ambani : రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన పట్టును మరింత బిగించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించాయనే ఆరోపణలపై ఈడీ సుదీర్ఘకాలంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా నాలుగు వేర్వేరు ఉత్తర్వుల ద్వారా రూ.1,885 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇందులో బ్యాంక్ బ్యాలెన్స్‌లు, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్లు మరియు స్థిర ఆస్తులు ఉన్నాయి.

ముఖ్యంగా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన అనుబంధ సంస్థలైన బీఎస్ఈఎస్ యమునా పవర్, బీఎస్ఈఎస్ రాజధాని పవర్, ముంబై మెట్రో వన్ వంటి కీలక ప్రాజెక్టులలో ఉన్న వాటాలను కూడా ఈడీ అటాచ్ చేసింది. అనిల్ అంబానీ గ్రూపులోని ఉన్నత స్థాయి ఉద్యోగులైన అంగరై సేతురామన్ పేరుతో ఉన్న నివాస గృహాన్ని, పునీత్ గార్గ్ పేరుతో ఉన్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాల్యూ కార్ప్ ఫైనాన్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు చెందిన దాదాపు రూ.300 కోట్ల నిధులను కూడా జప్తు చేశారు.

యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తో కలిసి అనిల్ అంబానీ గ్రూపు భారీగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రిలయన్స్ కంపెనీల్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి చివరకు ఎన్పీఏ (మొండి బకాయిలు)గా మార్చేశారని దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ల ద్వారా సేకరించిన ప్రజల సొమ్మును యెస్ బ్యాంక్ ద్వారా రిలయన్స్ గ్రూపు కంపెనీలకు చేరవేసి, రూల్స్ బ్రేక్ చేశారని ఈడీ పేర్కొంది.

కేవలం ఆర్‌కామ్ ఒక్కటే బ్యాంకులకు దాదాపు రూ.40,000 కోట్లకు పైగా బకాయి పడటమే కాకుండా, పలు బ్యాంకులు ఆ ఖాతాలను ఫ్రాడ్‎గా ప్రకటించాయి. తాజా జప్తుతో కలిపి అనిల్ అంబానీ గ్రూపు నుంచి ఈడీ అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.12,000 కోట్లకు చేరుకుంది. నిందితుల నుంచి ఈ నేరపూరిత సొమ్మును రికవరీ చేసి, బాధితులకు తిరిగి ఇప్పించడమే తమ లక్ష్యమని ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు లేదా జప్తులు జరిగే అవకాశం ఉందని సమాచారం.

Tags

Next Story